బెల్టుషాపులతో జోరుగా వ్యాపారం

ఇష్టారాజ్యంగా అమ్మకాలు
కామారెడ్డి,ఫిబ్రవరి 26(జనం సాక్షి): ఒకవైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే, మరోవైపు బెల్టు దుకాణాలతో కొందరు ప్రజలను మత్తులో ముంచెత్తు తున్నారు. తమ వ్యాపారం సాగడం కోసం వారిని మత్తుకు దగ్గరగా చేస్తున్నారు.నిబంధనలకు వ్యతిరేకంగా బెల్టు దుకాణాలు కొనసాగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. మద్యం వ్యాపారులు, పలువురు పలుకుబడి ఉన్నవారు సిండికేట్‌గా మారి మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు పోటీపడ్డారు. వీటికితోడు బెల్టు షాపుల నిర్వహణకు మాత్రం ఏమాత్రం అడ్డు అదుపూ లేకుండా పోయిందని విమర్శలు ఉన్నాయి. బెల్టు షాపుల నిర్వహణకు అడ్డుకట్ట వేయాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే బెల్టు షాపులను నిర్వాహకులు యథేచ్ఛగా దందాను సాగిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలను చేపడుతున్నారు. గ్రామాలు, తండాల్లో బెల్టు దుకాణాల్లో కొనసాగుతున్న మద్యం విక్రయాలతో గ్రావిూణ ప్రజలు జేబులు గుల్ల చేస్తున్నారు. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రామాల్లో బెల్లు దుకాణాలు జోరందుకున్నాయి. ఒక్కో గ్రామంలో రెండు నుంచి ఐదారువరకు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల వరకు బెల్టు దుకాణాలు కొనసా గుతున్నట్లు సమాచారం. గ్రావిూణ ప్రాంతాల్లోని మద్యం ప్రియులకు సౌకర్యవంతం గా ఉండేందుకు వీలుగా గ్రామాల్లోనే మద్యం అమ్ముతున్నారు. గ్రామాల్లో జోరుగా సాగుతున్న ఈ బెల్టుషాపుల నిర్వహణకు అడ్డుకట్ట వేయాలని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. మద్యానికి బానిస కావడం తో చాలా కుంటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొందరు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న
సంఘటనలున్నాయి.