బైరెడ్డి దీక్షకు మంద కృష్ణ జై


హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి) :
రాయలసీమ హక్కుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేపట్టిన రాయలసీమ సింహగర్జన దీక్షకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ జై కొట్టారు. రాయల తెలంగాణ పేరిట రాయలసీమను విచ్ఛిన్నం చేసే కుట్రలకు నిరసనగా బైరెడ్డి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం దీక్ష చేపట్టారు. సీమ విచ్ఛిన్నానికి కుట్రలు జరుగుతున్నా.. ఆ ప్రాంతానికి చెందిన 52 మంది ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసీరెడ్డి సహా పలువురు నేతలు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. వెయ్యి మంది సోనియాలు, లక్ష మంది దిగ్విజయ్‌సింగ్‌లు వచ్చినా రాయలసీమ జిల్లాలను విడగొట్టలేరని అన్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాయలసీమ జిల్లాలను విభజించాలని చూస్తుంటే.. అదే సీమకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, పదవిని కాపాడుకోవడానికే సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు. సీమ జిల్లాల విభజనపై రెఫరెండం పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీమ జిల్లాల విభజనపై నోరు విప్పని ఆ ప్రాంతానికి చెందిన 52 మంది ఎమ్మెల్యేలకు ప్రజలు సమాధి కడతారని హెచ్చరించారు. ప్రత్యేక రాయలసీమ రాష్టాన్రికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాయలసీమ విభజనను తీవ్రంగా ప్రతిఘటిస్తామని తులసీరెడ్డి తెలిపారు. సీమ విభజన జరిగితే ఈ ప్రాంతం ఉనికే కోల్పోతుందని హెచ్చరించారు. రాయలసీమ అన్నది భవిష్యత్తులో వినబడదు, కనబడదు అనుకుంటే, బతికి ఉండడమే దండగ అని వ్యాఖ్యానించారు. సీమను ముక్కలు చేసే ప్రతిపాదనను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు.