భక్తి భావం ఉట్టిపడేలా ఆగమశాస్త్రం ప్రకారం గుట్ట
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ ఆగష్టు 31 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చేవిధంగా యాదగిరిగుట్ట ప్రాంతం ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు. భక్తి భావం విరాజిల్లేలా, ప్రకృతి అందాలు ద్విగుణీకృతం అయ్యేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, ఆహ్లాదం పంచేలా తీర్చిదిద్దాలని సూచించారు. నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట అభివృద్ధిపై హైదరాబాద్ బేగంపేటలోని అధికార నివాసంలో ముఖ్యమంత్రి సవిూక్ష జరిపారు. లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చక్కగా తీర్చిదిద్దడం కోసం రూపొందించిన బ్లూ ప్రింటుని సీఎం కేసీఆర్ పరిశీలించారు.
ఆలయ స్థపతి ఆనందసాయి, ఆర్కిటెక్టులు రాజు, జగన్ తదితరులు యాదగిరిగుట్ట అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రధాన గుట్టపై దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన దేవాలయ ప్రాంగణం, నాలుగు మాడ వీధులు, నాలుగు రాజ గోపురాలు, కాలి నడక మార్గం, భక్తుల క్యూ కాంప్లెక్స్, బ్ర¬్మత్సవాలు జరిగే ప్రాంతం, ఈశాన్యంలో పుష్కరిణి విస్తరణ, తూర్పున శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, పశ్చిమాన ప్రధాన ప్రవేశ ద్వారం తదితర నిర్మాణాల డిజైన్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని నాలుగు వైపుల పాకశాల, అద్దాల మంటపం, కళ్యాణ మంటపం, యాగశాల డిజైన్లను కూడా ముఖ్యమంత్రికి చూపించారు.
యాదగిరిగుట్టను సందర్శించినప్పుడు సీఎం కేసీఆర్ పరిశీలించిన అంశాలను గతంలో జరిగిన సవిూక్ష సమావేశాల్లో స్థపతి, ఆర్కిటెక్టులకు సూచించారు. వాటికి అనుగుణంగా డిజైన్లు రూపొందించినట్టు ఆలయ శిల్పులు తెలిపారు. యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కల ఉన్న గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు రావాలన్న అంశంలో ఈ సమావేశంలో స్పష్టత వచ్చింది.
ప్రధాన ఆలయంలో భాగంగానే పుష్కరిణి, కళ్యాణకట్ట, దేవాలయానికి అభిముఖంగా దేవుడి వస్తువులు లభించే దుకాణాలు, మండల దీక్షలు చేసేవారి కోసం వసతి, భక్తులు బస చేయడానికి కాంప్లెక్సులు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రస్తుతం గుహలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్ యథావిధిగానే ఉండాలని, మిగిలిన ప్రాంతమంతా ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు. ఆలయం పవిత్రత దృష్ట్యా ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధులు ఉండాలన్నారు.
గుట్టపై ఏకకాలంలో 30 వేల మంది భక్తులు కలియతిరిగినా ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాలు ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు. భక్తులు సేద తీరడానికి వీలుగా గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రధాన గుట్ట చుట్టూ ఉన్న ఇతర గుట్టలను కూడా చక్కగా తయారు చేయాలని చెప్పారు. అతిథి గృహాలు, కాటేజీలు, అందమైన ఉద్యాన వనాలు, విశాలమైన రోడ్లు, గుట్టపైకి వచ్చి వెళ్లడానికి వేరువేరు రోడ్లు ఉండాలన్నారు. గుట్ట కింది భాగంలో 2500 మంది పట్టేలా కళ్యాణ మంటపం నిర్మించాలని సూచించారు.
యాదగిరిగుట్ట సవిూపంలోని బస్వాపూర్ చెరువును పెద్ద రిజర్వాయరుగా మారుస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. రిజర్వాయరుకు అనుబంధంగా మైసూరు బృందావన్ గార్డెన్ తరహాలో థీమ్ పార్కు నిర్మించాలన్నారు. మొత్తం యాదగిరిగుట్ట ప్రాంతమంతా భక్తి పారవశ్యం నిండాలని, కుటుంబ సభ్యులతో సహా వచ్చేవారు ఆనందంగా, ఆహ్లాదంగా గడిపే వాతావరణం సృష్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. యాదగిరిగుట్ట ప్రాంతమంతా సెంట్రలైజ్డ్ మైక్ సిస్టం ఏర్పాటు చేయాలని, నిత్యం స్తోత్రాలు వినిపించాలని చెప్పారు. భక్తులకు సరిపడ మంచినీటి సరఫరా ఉండాలని, మెరుగైన మురుగునీటి నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు.
యాదగిరిగుట్ట డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, సీఈఓ జె.కిషన్ రావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు ఈ సవిూక్షలో పాల్గొన్నారు.