భద్రాద్రిలో టీటీడీ సహకారంతో సౌకర్యాల కల్పన
ఖమ్మం, జూలై 20 : ప్రముఖ పుణ్య క్షేత్రగా పేరుగాంచిన భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని దర్శించుకునే భక్తులకు సరైన వసతి అందుబాటులో లేదు. రామా నిలయంలోని 62 కాటేజీలు, సౌమిత్రిలోని 30, శ్రీరాం సదనంలోని 18, టీటీడీవారి 18 గదులు, ఇతర కాటేజీలు 23లలో అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. దీంతో దేవస్తానానికి రోజుకు 80 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఇక శని, ఆదివారాల్లో మాత్రం వసతి సౌకర్యం సరిపోవడంలేదు. ఇకపోతే శ్రీరామ నవమి, ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో మాత్రం రామభక్తులకు ఇసుకతిన్నెలే పట్టుపాన్పులుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ సహకారాన్ని రామాలయం ధర్మకర్తల మండలి సభ్యులు అభ్యర్థించారు. వీరు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, టీటీడీ ఆర్థిక విభాగం అధికారిని కలిసి సమస్యను వివరించారు.టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు రామభక్తుడైనందునా ఆయనను కలిసి ఇక్కడి పరిస్థితిని వివరిస్తామన్నారు. భద్రాచలంలో వంద గదుల సత్రంతో పాటు కల్యాణమండపాన్ని నిర్మించాలని ధర్మకర్తలి మండలి సభ్యులు టీటీడీని కోరింది.