భద్రాద్రి ప్రాంత పరిరక్షణకై ఆహ్వానం: బూసిరెడ్డి శంకర్ రెడ్డి
బూర్గంపహాడ్ ఆగస్టు12 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం, మండల పరిధిలోని రెడ్డిపాలెం, సంజీవరెడ్డి పాలెం, సారపాక, మోతే, ఇరువెండి గ్రామాల ప్రముఖులకు రైతు నాయకులకు అందరికి భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాలను పరిరక్షించుకోవడానికి ముంపు ప్రాంతాల ప్రజలు నడుం కట్టాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి నది వరదల వల్ల భద్రాచలం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తీవ్రంగా నష్టపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కట్టిన తర్వాత గోదావరికి పిలిస్తే పలికే విధంగా వరదలు వస్తూ ఉన్నాయని, ఇకనుండి వస్తూ ఉంటాయన్నారు. మన ప్రాంతం ముంపుకు గురికాకుండా ప్రభుత్వాలు ముంపు నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పాలంటే మనందరం కలిసికట్టుగా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే విషయంపై గత పది సంవత్సరాల క్రితమే, రాష్ట్ర విభజన సమయంలోనే భద్రాద్రిప్రాంత పరిరక్షణసమితి తరపున పోరాడి ముంపు ప్రాంత నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను నివేదించి ఉన్నామన్నారు. ఇప్పుడు మళ్లీ ఉద్యమించక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాబట్టి మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మనమందరం ఏకతాటిపై, పార్టీలకు అతీతంగా తీవ్రంగా ఉద్యమించకపోతే మన గ్రామాలన్నీ గోదావరి నది వరదల ముంపుతో తీవ్రంగా కోలుకోలేనంత నష్ట పోవాల్సిన ప్రమాదపరిస్థితి ఏర్పడుతుందన్నారు.
త్వరలో సమావేశమై కార్యాచరణకు శ్రీకారం చుడదామని..! మన ప్రాంతాన్ని కాపాడుకుందామన్నారు.