భారత్‌పై ఆసీస్‌ మహిళల జట్టు విజయం

ముంబై ,జనవరి 29 :ప్రపంచకప్‌కు ముందు భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను సునా యాసంగా ఓడించిన మన జట్టు రెండో మ్యాచ్‌లో ఆసీస్‌పై పరాజయం పాలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు పూనమ్‌ రౌత్‌ , కామిని శుభారంభమే ఇచ్చారు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. కామిని 30 పరుగులకు ఔటైనా…మోనా మిశ్రామ్‌ , రౌత్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించారు. రెండో వికెట్‌కు 54 పరుగుల పార్టనర్‌షిప్‌ నెలకొల్పారు. అయితే మిడిలార్డర్‌ తడబడడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివర్లో మోనా మల్హోత్రా , నిరంజనా ధాటిగా ఆడడంతో స్కోర్‌ 200 దాటింది. వీరి జోడీ ఎనిమిదో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. దీంతో భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 222 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన ఆసీస్‌ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా… మళ్లీ పుంజుకుంది. మిడిలార్డర్‌ రాణించి ఆసీస్‌ విజయాన్ని పూర్తి చేశారు. ప్రారంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు దానిని చివరి వరకూ కొనసాగించలేకపోయారు. దీంతో ఆస్టేల్రియా మహిళల జట్టు 38.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.