భారత చట్టాలతో పాటు అంతర్జాతీయ వ్యవస్థలపై అవగాహన అవసరం – ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 22( జనంసాక్షి): ప్రస్తుత విద్యార్థులకు భారత చట్టాలతో పాటు అంతర్జాతీయ వ్యవస్థలపై ఖచ్చితమైన అవగాహన ఉండాలని, తద్వారా ప్రపంచంలోనే ఏ దేశానికి మనం వెళ్ళినా పూర్తి స్వేచ్ఛతో జీవించడానికి అవకాశం ఉంటుందని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ అన్నారు. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పరిధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈకార్యక్రమానికి పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు వసుంధర అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పూలపల్లి రవీందర్ హాజరయ్యారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి తాడిబోయిన రామస్వామి యాదవ్, డాక్టర్ పూలపల్లి రవీందర్ మాట్లాడుతూ అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక సామాజిక అభివద్ది, మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థే ఐక్యరాజ్య సమితి అని తెలిపారు. మొదటి ప్రపచయుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధం నివారించలేకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా 1945, అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి ఆవిష్కృతమై తనకార్య కలాపాలను ప్రారంభించడం జరిగిందన్నారు. యుద్దాలు జరగకుండా చూడడం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాలమద్య సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ భాద్యతలను అన్ని దేశాలు గౌరవించే విధంగా చేయడం, సాంఘిక అభివృద్ధిని సాధించి, మన జీవితాలను శాంతియుత వాతావరణంలో కొనసాగేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యమని అన్నారు. ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉందని, దీనిలో 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయన్నారు. యుఎన్ఓ లో సర్వ ప్రతినిధి సభ, భద్రతామండలి, సచివాలయం, ధర్మ కర్తృత్వ మండలి, ఆర్థిక, సాంఘిక మండలి అంతర్జాతీయ న్యాయస్థానం మొదలగు కీలక విభాగాలు పనిచేస్తుంటాయని, ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ పర్యవేక్షణలో వ్యవస్థ కొనసాగుతుందని, ఈ సెక్రెటరీ జనరల్ ని నాలుగేళ్లకు ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉందని, అందులో పదిదేశాలకు రెండు సంవత్సరములకు ఒకసారి ఎన్నికద్వారా సభ్యత్వం కల్పిస్తారన్నారు. మిగిలిన ఐదుదేశాలు శాశ్వత సభ్యత్వంకలిగిన అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఆర్థిక, సామాజిక, సాంస్కతిక విద్య, వైద్య మొదలైన రంగాల్లో పనిచేస్తాయని, వీటికి ఆర్థిక, సామాజికమండలి సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు. యునెస్కో ,(ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్), యూనిసెఫ్(బాలల అత్యవసర నిధి), యుఎన్ డిపి (అభివృద్ధి కార్యక్రమాలు), యుయెన్ ఈపి (పర్యావరణ కార్యక్రమాలు- ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం), యుఎన్ ఎఫ్ఏఓ (ఆహార వ్యవసాయ సంస్థ), యుఎన్ ఐఎల్ ఓ (కార్మిక సంస్థ), యుఎన్ డబ్ల్యుహెచ్ ఓ (ఆరోగ్య సంస్థ యు), యుఎన్ ఐడిఓ (పారిశ్రామిక సంస్థ), యుఎన్ హెచ్ సిఆర్ (శరణాలయాల హై కమిషన్), యుఎన్ యుపియు (విశ్వ పోస్టల్ యూనియన్), యు ఎన్ డబ్ల్యుఎంఓ (వాతావరణ సంస్థ ), యుఎన్ఐఏఈఏ (అను శక్తి సంస్థ ), యుఎన్ సిపిఏ (వాణిజ్య అభివృద్ధి సంస్థ), యుఎన్ ఐపిఓ (టెలి కమ్యూనికేషన్ సంస్థ), యుఎన్ డబ్ల్యుఓ (వరల్డ్ బ్యాంక్), యుఎన్ ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మ్యానిటరీ ఫండ్), ఉమెన్ వింగ్ తదితర 17 అనుబంధ సంస్థలకు ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు తమ వార్షికబడ్జెట్ లోనుంచి నిధులు సమకురుస్తాయని, అందువల్ల ఆయా దేశాలకు సంబంధిత సేవలను అందిస్తాయని అన్నారు. ఐ్యరాజ్యసమితి దినోత్సవాన్ని అక్టోబర్ 24 (ఆవిర్భావ దినోత్సవం)రోజున ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ లల్లో సమానత్వం, శాంతి సహకారంకోసం నిర్వహిస్తున్నారని, ఐతే ఐక్యరాజ్యసమితి ప్రతీసంవత్సరం ఒకకొత్త నినాదాన్ని ఇవ్వడం ఆనవాయితీ అని, ఈ 2022 సంవత్సరానికిగాను ‘జాత్యహంకారాన్ని అంతం చేయండి… శాంతిని నిర్మించండి’ అని పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బి.మదన్మోహన్, ఎల్. సత్యనారాయణరావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

తాజావార్తలు