భారత స్పిన్ బౌలింగ్ కోచ్ రేసులో నరేంద్ర హిర్వాణీ
ముంబై ,ఫిబ్రవరి 1 : టీమిండియాకు స్పిన్ బౌలింగ్ కోచ్‌ను ఏర్పాటు చేయాలన్న బీసిసిఐ ఆలోచను తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలువురి మాజీ స్పిన్నర్ల పేర్లను దీని కోసం పరిశీలిస్తోంది. అయితే మాజీ స్పిన్నర్ నరేంద్ర హిర్వాణీ రేసులో ముందున్నట్టు సమాచారం. ఆస్టేల్రియాతో టెస్ట్ సిరీస్‌కు ముందుగానే స్పిన్ కోచ్‌ను నియమించాలని బోర్డు భావిస్తోంది. 44 ఏళ్ళ హిర్వాణీ 1988-1996 మధ్యలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తన లెగ్‌బ్రేక్ గూగ్లీలతో 17 టెస్టుల్లో 66 వికెట్లు , 18 వన్డేల్లో 23 వికెట్లు తీసుకున్నాడు. ఇటీవల సందీప్ పాటిల్ సారథ్యంలో కొత్త సెలక్షన్ కమిటీ బాధ్యతలు తీసుకునే వరకూ హిర్వాణీ సెంట్రల్‌జోన్ సెలక్టర్‌గా వ్యవహరించాడు. 1988లో విండీస్‌పై మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసిన హిర్వాణీ 16 వికెట్లతో సత్తా చాటాడు. ఇదిలా ఉంటే హిర్వాణీతో పాటు మరో మాజీ స్పిన్నర్ మణీందర్‌సింగ్ పేరును కూడా బోర్డు పరిశీలిస్తోంది. మణీందర్ 35 టెస్టుల్లో 88 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది ఇంగ్లాండ్ చేతిలో సొంతగడ్డపైనే భారత్ టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్పిన్ పిచ్‌లపైనే మన స్పిన్నర్లు విఫలమవడంతో ప్రత్యేక కోచ్‌ను నియమించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీనికి తోడు స్పిన్ రిజర్వ్ బెంచ్ పటిష్టంగా లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ , ప్రగ్యాన్ ఓజా టెస్టుల్లో స్పిన్నర్లుగా కొనసాగుతుంటే.. హర్భజన్‌సింగ్ రిటైర్మెంట్‌కు దగ్గరయ్యాడు. అటు అమిత్‌మిశ్రా , పియూష్ చావ్లా తర్వాత యువస్పిన్నర్లెవరూ లేకపోవడంతో కోచ్‌ను నియమించడం ద్వారా రిజర్వ్ బెంచ్ భర్తీ చేయాలని బీసిసిఐ భావిస్తోంది.