భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలి

, జులై 12, జనంసాక్షి: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోటు గణేష్ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఎక్కువగా నిలుస్తాయని, ఇటువంటి వాతావరణం వలన కరెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాల వద్దకు అసలు వెళ్లవద్దని, వాటిని తాకినా ఒక్కో సారి కరెంట్ షాక్ వచ్చి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. వర్షాకాలంలో ఇళ్లలోని జిఎ ఇనుప వైర్లకు గృహిణిలు దుస్తులు ఆరవేయవద్దని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండవద్దని, వర్షాల వలన ఊహించని విధంగా అవి కూలిపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఇంటి ఆవరణలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నిరుపయోగంగా పడవేసిన పాత కూలర్లు, పాత్రలు, ప్లాస్టిక్ డబ్బాలలో కూడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. వీటి వలన దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని అన్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద తడిసిన స్టార్టర్ బాక్స్ లను, ఫ్యూజ్ బాక్స్ లను చేతులతో ముట్టుకోవడం ప్రమాదకరమని తెలిపారు. చెరువులు, వాగుల్లోకి వరద నీరు చేరుతుందని, వీటి వద్దకు సరదా కోసమైనా అసలు వెళ్లవద్దని కోరారు. భారీ వర్షం, బలమైన గాలులకు రహదారుల వెంట చెట్లు కూలి పోవడం రోడ్లు కొట్టుకోవడం జరుగుతుందని, రాకపోకలు సాగించే సమయంలో రాత్రి వేళ అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.