భారీ వర్షాల దృష్ట్యా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి

వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్

జులై 11, జనంసాక్షి: భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం క్వారెంటైన్లో వైద్యం తీసుకుంటున్న ఆయన భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రధాన యంత్రాంగంతో ఫోన్లో మాట్లాడారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని పరిస్థితుల గురించి వివరాలు తెలుసుకున్నారు. నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడిస్తున్న దృష్ట్యా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితులల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. తుప్పుపట్టిన కరెంట్ స్తంభాలు, ఇనుప స్థంబాలను తాకరాదని, ఇళ్ల వద్ద కూడా కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువులు, నీటి ప్రవాహక ప్రాంతాల వద్దకు వెళ్లకుండా రైతులు, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.