భూపాలపల్లి జిల్లాలో గవర్నర్ పర్యటన
గిరిజనుల స్వాగతానికి తమిళసై ఫిదా
జయశంకర్ భూపాలపల్లి,డిసెంబర్10(జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా భూపాలపల్లిలో జనరిక్ మందుల దుకాణాన్ని గవర్నర్ ప్రారంభించారు.ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు అనిర్వచనీయమనీ.. ఆ సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువేనని తమిళిసై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు.రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కేంద్రంలో జనరిక్ మెడికల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంఅభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దశాబ్దాల కాలం నుంచి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమాజానికి చేస్తున్న సేవ చాలా గొప్పదన్నారు. అనంతరం కాటారం మండలం బోడగూడెంను గవర్నర్ సందర్శించారు. డప్పు వాయిద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలను గవర్నర్‌కు గిరిజనులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోడగూడెంలో గిరిజనులతో గవర్నర్ తమిళిసై మాట్లాడారు. గిరిజనుల సమస్యలు, వారి జీవన స్థితిగతులను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గవర్నర్‌గా కాదు విూ సోదరిగా బోడగూడెం వచ్చాను. బోడగూడెం గ్రామస్థులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఆదివాసీలు నాపై చూపించిన అభిమానం నన్ను కదిలించింది. రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. డబుల్ బెడ్రూం ఇండ్లు, సాగు చేసేందుకు భూమి కావాలని కోరారు. అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. విూ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తాను అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వేంకటేశ్వర్లు, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.