మంత్రి గల్లా ఎస్కార్ట్ వాహనం బోల్తా
– వాహన శ్రేణిలోని నలుగురికి గాయాలు
చిత్తూరు, జూన్ 25 : రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఎస్కార్ట్ వాహన శ్రేణిలోని ఒక వాహనం బోల్తా పడిన దుర్ఘటన సోమవారం నలుగురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా చిన్న గొట్టికల మండలం దేవరకొండ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన నీటి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి అరుణకుమారి భాక్రాపేటకు వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. కొత్తపల్లి సమీపంలో అప్పినాయని చెరువు కట్ట వద్ద భాక్రాపేట పోలీసు వాహనం అదపుతప్పి 30 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ అశోక్‌కుమార్‌కు స్వల్ప గాయాలు కాగా, కానిస్టేబుల్ ఉమాపతి, చెంగల్రాయులు, భాస్కర్, జీపు డ్రైవర్ శ్రీనివాసులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన మంత్రి అరుణకుమారి, ఇతర ఎస్కార్ట్ సిబ్బంది గాయపడిన వారిని వెలికి తీసుకువచ్చి హుటాహుటిన తిరుపతి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని మంత్రి అరుణకుమారి పరామర్శించారు. క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించిన వైద్యులు ప్రాణాపాయం తప్పిందని ప్రకటించారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న మంత్రి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.