మతకలహాలులేని గొప్ప నగరం హైదరాబాద్‌

C
– 1929లో మహాత్మగాంధీ చెప్పిండు

– దొంగతనం చేసి బాబు అడ్డంగా దొరికిండు

-గాయి చేసుడెందుకు

– తెరాస కండువ కప్పి డీఎస్‌ పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

– బంగారు తెలంగాణ కోసమే తెరాసలో చేరా:డీఎస్‌

హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): హైదరాబాద్‌ మత కలహలులేని గోప్ప నగరం అని  టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ అన్నారు.మధ్యల వచ్చినోళ్లకు మన కల్చర్‌ తెలియదని, పిసిసి మాజీ చీఫ్‌ డిఎస్‌ టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సిఎం మాట్లాడారు. ఈద్‌ ముబారక్‌ అనమంటే ఊద్‌ ముబార్‌ అంటున్నారని విమర్శించారు. మనది గంగా జమునా తెహజీబ్‌. హైదరాబాద్‌ గొప్ప నగరమని 1923లో మహాత్మాగాంధీనే అన్నారని గుర్తు చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రంజాన్‌ను ఘనంగా జరిపేందుకు పెద్ద ఎత్తున ఇఫ్తార్‌ ఇస్తున్నామని అన్నారు. నాకు అండగా ఉంటానని టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన డీఎస్‌కు సెల్యూట్‌ చేస్తున్నానని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. డీఎస్‌తో నాకు 35 ఏళ్ల నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ఇప్పుడు  ఏడాది బిడ్డ అని, ఇది సంధికాలమని  ఈ సమయంలో జాగ్రత్తగా అభివృద్ది చేసుకుని ముందుకు సాగాల్సిన తరుణమన్నారు. అయితే ఈదశలో కొత్తగా ఏర్పడ్డ దశలోనే పుట్టిన బిడ్డను గొంతు పిసికి అవతల పడేయాలన్న కుట్రలు సాగాయన్నారు. ఈ దశలో తెలంగాణను అభవృద్ది చేసుకుని ముందుకు సాగుతున్న తరుణంలో వీటన్నటిని ఎదిరించాల్సి ఉందన్నారు.  టీఆర్‌ఎస్‌ బలపడితే తెలంగాణ బలపడినట్లే అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎందుకంటే తెలంగాణ కోసం పోట్లాడి తీసుకుని వచ్చింది టిఆర్‌ఎస్‌ కనుక మాకే ఎక్కువ బాధ్యత ఉందన్నారు.  డీఎస్‌కు పదవులు ఒక లేక్క కాదన్న ఆయన బంగారు తెలంగాణ సాధనలో డీఎస్‌ సేవలను వినియోగించుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయినా తెలంగాణనై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశలు వదులుకోలేదని కెసిఆర్‌  విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా   దొంగతనం చేసి    దొరికిపోయినా ఎంత గత్తర చేస్తున్నారా చూస్తున్నామని అన్నారు. రాజకీయాలలో ఉన్నంత మాత్రాన శత్రువులం కామని కెసిఆర్‌ అన్నారు. ఎవరో కొందరు మూర్ఖులు కత్తులు దూసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.  మనం ఏవిూ చేయలేదని, తెలంగాణ ఎమ్మెల్యేని కొంటూ చంద్రబాబు పట్టుబడ్డారని ,ఇందులో మన ప్రమేయం ఏముందని అన్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు కల్పించారని అన్నారు.కరెంటు ఇవ్వనని అన్నారని, కార్పొరేషన్ల ఖాతాలు స్తంభింపచేశారని ,ఇలా రకరకాల వివాదాలు పెట్టారని అన్నారు. చంద్రబాబు తన రాష్ట్రంలో ఏమైనా చేసుకోవచ్చని, ఆయనకు పదమూడు జిల్లాలు ఉన్నాయని, అక్కడ సమస్యలు చూసుకోవచ్చు కదా అని అన్నారు. ఇక్కడ ఉన్న కొందరు నాయకులు కూడా అనుచితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నాయకులకు సహనం అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పసిగుడ్డు అని, దీనిని ఏదో చేయడానికి అవతలవాడు ప్రయత్నిస్తున్నప్పుడు తెలంగాణ నాయకత్వం ఏమి చేయాలని అంటూ ,అంతా సహకరించవలసిన అవసరం లేదా అని ప్రశ్నించారు.  కొందరు పొద్దున లేచినకాడినుంచి ప్రభుత్వాన్ని తిట్టడమే కార్యక్రమం పెట్టుకున్నారని అన్నారు.  వెయ్యేళ్ల బతుకుతామా ?ఉన్నాన్నాళ్లు ఎంత బాగా చేశామన్నది ముఖ్యమని అన్నారు.  వాళ్లకు 13 జిల్లాలతో శ్రీకాకుళం నుంచి, అనంతవరకు బోలెడు జాగా ఉంటేవాళ్ల పాలన వాళ్లు చేసుకోవచ్చు కదా అని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏడాది బిడ్డ అని ప్రభుత్వాన్ని తిట్టడం గొప్ప అనుకుంటే తప్పని ఆయన అన్నారు. ఉన్న నాలుగు రోజులు …ఎంత మంచిగా పనిచేశామన్నది లెక్క అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.  రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని ఆరోపించారు. వాళ్ల పాలన వాళ్లు చూసుకోకుండా తెలంగాణ పాలనలో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో మనం ఏం చేయలే.. దొంగతనం చేస్తే పట్టుకున్నాం. మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుంది చంద్రబాబు తీరు అని సీఎం ధ్వజమెత్తారు. సాగిచ్చుకున్నన్ని రోజులు సాగిచ్చుకున్నరు.. మా బతుకు మమ్మల్ని బతుకనివ్వండి అని సీఎం ఘాటుగా స్పందించారు. ఇక ప్రతి పనికి అడ్డుపడటం సరికాదన్నారు. ఈ టైమ్‌ లో తెలంగాణ మేధావులు, సీనియర్‌ రాజకీయ నాయకత్వం ఆలోచించాలని అన్నారు. పార్టీలో చేరే సీనియర్‌ లకు తగు గౌరవం ఇస్తామని అన్నారు.శ్రీనివాస్‌ కు అన్ని విషయాలలో అవగాహన ఉందని అన్నారు.  తెలంగాణ ఉద్యమకాలంలో డీఎస్‌ తమకు సలహాలు ఇచ్చేవారని.. ప్రత్యేక రాష్ట్రానికి వైఎస్‌ అడ్డుపడినా డీఎస్‌ ఎదిరించారన్నారు.ఆంధ్రాలో కష్టాలు లేవా, సమస్యలు లేవా అని ప్రశ్నించారు. విూ జాగలో విూరుండక హైదరాబాద్‌కు పట్టుకుని వేలాడుతున్నారని ధ్వజమెత్తారు.  నాకు, డీఎస్‌ లాంటి వ్యక్తికి పదవులు లెక్క కాదు. ఎన్ని పదవులు అనుభవించలేదు. పదవులు అనేవి శాశ్వతం కాదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతల ప్రభుత్వమనే భావనతోనే డీఎస్‌ మాతో కలిశారు. ప్రతీ విషయంలోనూ డీఎస్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. డీఎస్‌ సూచనలు, సలహాలతో ముందుకెళ్దామని ప్రకటించారు. ఆయన ఎందరికో డిఫారమ్‌లు ఇచ్చిన ఘనుడన్నారు. డీఎస్‌ చేరికను నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా ఆహ్వానించారు. డీఎస్‌ చేరికపై పోచారంతో పాటు ఎమ్మెల్యేలను సంప్రదించగా.. మంచి నిర్ణయం సార్‌. డీఎస్‌ను పార్టీలోకి ఆహ్వానించండి. ఆయన మాకు పెద్ద దిక్కుగా ఉంటారు. బాగుంటుంది సార్‌ అని ప్రోత్సహించారని అన్నారు. ఉద్యమ సమయంలో డీఎస్‌ నాతో టచ్‌లో ఉండి అన్ని సమస్యలపై మాట్లాడేవారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు డీఎస్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు. డీఎస్‌ సంస్కారం కల వ్యక్తి. చిల్లరమల్లరగా మాట్లాడే అలవాటు లేదు. పద్ధతితో పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువ కప్పి ఆహ్వానించారు. ఓ తమ్ముడిగా ఆయనను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ప్రజలను ఒక్కటి చేసే నాయకత్వం , తెలంగాణ శక్తులను కలిపే నాయకత్వం ఉంటే తెలంగాణ ప్రజలు , తెలంగాణ సమాజం అంతా ఒకటి అవుతుందని తాను గతంలోనే చెప్పానని కెసిఆర్‌ చెప్పారు. గతంలో ప్రస్తుత ఎమ్‌.పి వినోద్‌ కుమార్‌ సందేహం వ్యక్తం చేసినప్పుడు ఈ సమాధానం చెప్పానని , చివరికి తాను ఆశించినట్లే ప్రజలు గెలిచారని అన్నారు. టిఆర్‌ఎస్‌ బలపడితే తెలంగాణ బలపడినట్లేనని కెసిఆర్‌ అన్నారు. ఎందరో కొట్టాడితే రాని తెలంగాణ ను తెచ్చిందే టిఆర్‌ఎస్‌ , అందులో డౌట్‌ లేదని అన్నారు. ఆ తర్వాత స్పష్టమైన మెజార్టీని ప్రజలు ఇచ్చారని అన్నారు. మద్యలో చాలామందికి అనుమానాలు ఉన్నాయని,వారిని పట్టించుకోనవసరం లేదని అన్నారు.

ఆత్మప్రబోధానుసారమే టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నానని పిసిసి మాజీ చీఫ్‌ డిఎస్‌ అన్నారు. కెసిఆర్‌  చేపట్టిన అనేక కార్యక్రమాలు తెలంగాణను ముందుకు తీసపుకుని వెళతాయన్నారు. అయితే తెచ్చుకున్న తెలంగానను బంగారు తెలంగాణగా అభివృద్ది చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ దశలో కలసికట్టుగా ముందుకు వెళుతూ కెసిఆర్‌కు అండగా నిలబడాల్సి ఉందన్నారు. ఇబ్బందికర పరిస్థితిలో బాగా ఆలోచించి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందని ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారని… ఆ తర్వాత కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టి ఉద్యమం చేపట్టి తెలంగాణ సాధించారని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ సాధించడానికి తన వంతు కృషి చేస్తానని డీఎస్‌ స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే బంగారు తెలంగాణ సాధ్యమని ధర్మపురి శ్రీనివాస్‌ ఉద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం డీఎస్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరిచి తెలంగాణను ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.. ప్రతి కార్యకర్త కూడా అందుకు అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

కెసిఆర్‌కు, సోనియాకు మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌ ఉండేదని అన్నారు. తెలంగాన కోసం తనవంతుగా ఏం చేశానని తనకు తెలుసని, కెసిఆర్‌కు తెలుసన్నారు. 1969 నుంచి ఈ ఉద్యమం జరుగుతున్నా టిడిపిలో మంచి పదవిలో ఉండి కూడా దానిని వదిలి టిఆర్‌ఎస్‌ను స్థాపించి సుదీర్ఘంగా పోరాడి తెలంగాణ సాధించారన్నారు. తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని కొనియాడారు. ఆరు దశాబ్దాల పోరాట ఫలితమే తెలంగాణ అని గుర్తు చేశారు. కేసీఆర్‌ పూర్తి అవగాహనతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. కేసీఆర్‌ కాకుండా వేరే వారు సీఎం అయితే తెలంగాణను అవగాహన చేసుకునేందుకు ఏడాది కాలం పట్టేదని తెలిపారు. సీఎంకు తెలంగాణలో ఉన్న సాగు భూముల గురించి తెలుసు. ఎక్కడ ఏ పంటలు పండుతాయో.. ఎక్కడ ఏయే నీటి ప్రాజెక్టులు ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ వెంటే ఉన్నానని తెలిపారు. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కేసీఆర్‌ నిరాహార దీక్షకు దిగారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణకు తన వంతు సహాయం అందిస్తానని స్పష్టం చేశారు.  పార్టీ మారుతున్నానని ప్రకటించిన నాటి నుంచి తనను పలువురు నేతలు తిట్టారు.. వారిని విమర్శించ దలుచుకోలేదని డీఎస్‌ స్పష్టం చేశారు. నా ఆత్మప్రబోధానుసారం నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను బీ-ఫారం ఇస్తే గెలిచిన వారు తిడుతున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అసవరం లేదు. తన వెంబడి వచ్చిన ప్రతీ నేతకు, కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు. బంగారు తెలంగాణలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు.కేసీఆర్‌తో అనుబంధం ఈనాటిది కాదని.. మూడు దశాబ్దాల నుంచి ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని డీఎస్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనే ధ్యేయంగా తెరాస ఏర్పడిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసినట్లు తెలిపారు. కేసీఆర్‌కు, సోనియాగాంధీకి మంచి సాన్నిహిత్యం ఉండటం వల్లేతెలంగాణ కల  సాకారమైందన్నారు. విడిపోయిన తెలుగు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి సాగించాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సుపరిపాలనా ధ్యేయంగా దూసుకుపోతుంటే.. ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రతిపనికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రా నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలంతా తెలంగాణ వాళ్లేనని.. వారిని సెటిలర్లుగా తాము భావించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ విషయం చాలాసార్లు స్పష్టం చేసినట్లు గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాల పాటు పోరాటం జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం క్రమశిక్షణతో ఉద్యమం చేపట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్‌తో పాటు తానూ పాత్ర వహించానన్నారు. నిరాహారదీక్ష సమయంలో కేసీఆర్‌ పరిస్థితి చూసి చలించిపోయి తెలంగాణ ఇచ్చేలా సోనియాగాంధీని ఒప్పించింది తానేనన్నారు. నిజామాబాద్‌ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, అనుచరుల సమక్షంలో ఆయన  పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో చేరారు. తెలంగాణభవన్‌లో డీఎస్‌కు తెరాస కండువా కప్పి కెసిఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. డీఎస్‌తో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు,  సర్పంచ్‌లు తెరాసలో చేరారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ కు సహకరించడానికి తాను టిఆర్‌ఎస్‌ లో చేరానని అన్నారు. తన సహకారం కూడా కావాలని కెసిఆర్‌ అన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రాణాలకు తెగించి కూడా కెసిఆర్‌ తెలంగాణ కోసం దీక్ష చేశారని అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని, అలాగే తెలంగాణ సాధించిన కెసిఆర్‌ ను అభినందిస్తున్నానని అన్నారు.

డీఎస్‌తోపాటు ఆయన కుమారుడు, జడ్పీ, ఎంపీటీసీ సభ్యులు, డీఎస్‌ వర్గానికి చెందిన కార్యకర్తలు టీర్‌ఎస్‌లో చేరారు. వారందరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాన కోసం నేను కూడా భాగస్వామిని అవుతానని, నా వంతు సహకారం అందిస్తానని, కేసీఆర్‌ నాయకత్వంలో కలిసి పనిచేస్తానని వచ్చిన డీఎస్‌కు స్వాగతం పలుకుతూ ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం ఖాళీ అయినా అనుమానం పడాల్సిన అవసరం లేదని పోచారం అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో అందరం కలిసి బంగారు తెలంగాణ సాధించడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, ఎంపీ కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ,హరీష్‌ రావు తదితరులు పాల్గొన్నారు.