మధ్యప్రదేశ్‌ మంత్రి రాజీనామా


లైంగిక వేధింపుల ఆరోపణలతో వైదొలిగిన ఆర్థిక మంత్రి
భోపాల్‌, జూలై 5 (జనంసాక్షి) :లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌ ఆర్థిక మంత్రి రాఘవ్‌జీ (79) వైదొలిగారు. శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. రాజీనామాను ఆమోదించాలని సీఎం, గవర్నర్‌ రాంనరేశ్‌ యాదవ్‌కు సిఫారసు చేస్తూ రాజీనామా లేఖను పంపించారు. మంత్రి రాఘవ్‌జీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన వద్ద పని చేసే ఓ వ్యక్తి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో రాజీనామా చేయాలని సీఎం రాఘవ్‌జీని ఆదేశించారు. దీంతో ఆయన శుక్రవారం తన పదవికి రాజీనామాచేశారు. ఆర్థిక శాఖ బాధ్యతలను జలవనరుల శాఖ మంత్రి జయంత్‌ మాలయ్యకు అప్పగించారు. ఆయన 2004 నుంచి 2013 వరకూ వరుసగా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ఇదిలా ఉంటే, రాఘవ్‌జీ వ్యవహారంపై ప్రతిపక్ష నేత అజయ్‌సింగ్‌ తీవ్రంగా మండిపడ్డారు. అవినీతికి పాల్పడడం కంటే నైతిక విలువలకు దిగజారి వ్యవహరించడం సరికాదన్నారు.