మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి

` తెలంగాణ-ఏపీ మధ్య విద్యుత్‌ బకాయిలపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యుత్‌ బకాయిల విషయంలో వివాదాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని హైకోర్టు తీర్పుచెప్పింది. బకాయిలు 3,441.78 కోట్లు చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు.. సర్‌చార్జీ తదితరాలు 3,315.14కోట్లు కలిపి మొత్తం 6,758.92 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలని.. తెలంగాణ ప్రభుత్వానికి గతఏడాది కేంద్రం జారీచేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. .తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం వేర్వేరు పిటిషన్లు దాఖలుచేశాయి. ఆ పిటిషన్లపై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం 65 పేజీల తీర్పు వెలువరించింది. వివాదం.. రెండు రాష్ట్రప్రభుత్వాల నియంత్రణలో ఉన్న సంస్థలకు సంబంధించినదన్న హైకోర్టు.. సామరస్యపూర్వకంగా ముఖ్యంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం అవసరమని అభిప్రాయపడిరది. వివాదాలు వస్తే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం తొలుత చర్చలతో.. ఆ తర్వాత ఆర్బిట్రేషన్‌ ద్వారా పరిష్కరించుకోవాలి. అందుకు ఏపీ ఈఆర్‌?సిని సంప్రదించవచ్చని ఉంది. అంటే రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల మధ్య.. తలెత్తే వివాదాల పరిష్కరానికి ప్రత్యామ్నాయ సంస్థ ఉన్నట్లే కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాద పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యామ్నాయ సంస్థను ఆశ్రయించకుండా.. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 92 కింద నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిందని పేర్కొంది. బకాయిలను సర్దుబాటు చేయరాదని.. తెలంగాణ వైద్యారోగ్య శాఖకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 12 వేల 500 కోట్లు రావాల్సి ఉందని.. కేంద్రానికి వేర్వేరుగా లేఖలు రాసిందని వివరించింది బకాయిలను తెలంగాణ సంస్థలు అంగీకరించినట్లయితే చెల్లిపులకు పట్టుపట్టవచ్చు. తెలంగాణ అంగీకరించనందున ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిరది. :పునర్వభజన చట్టంలోని సెక్షన్‌ 92 ప్రకారం మార్గదర్శకాలు జారీచేసేందుకు కేంద్రానికి అధికారాలు ఉంటాయని హైకోర్టు పేర్కొంది. ఐతే చట్టప్రకారం పారదర్శకంగా న్యాయంగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వివరించింది. ఏకపక్షంగా ఉతర్వులు ఇవ్వడం సరికాదని సూచించింది. సెక్షన్‌ 92లో సహజ న్యాయసూత్రాలకు మినహాయింపు లేదన్న న్యాయస్థానం.. బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం అలోచనారహితంగా ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది. ఏపీ ముఖ్యమంత్రి రాసిన లేఖ ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్న న్యాయస్థానం.. బకాయిలపై సమావేశాలు జరిగినా ఎంత మొత్తం చెల్లించాలని తేల్చలేదని గుర్తుచేసింది. ఉత్తర్వులు జారీచేసే ముందు.. తెలంగాణకు ఎలాంటి నోటీస్‌ జారీ చేయకపోవడం సరికాదని అభిప్రాయపడిరది. విద్యుత్‌ వినియోగానికి తెలంగాణ విద్యుత్‌ సంస్థలు సొమ్ము చెల్లించాలనడంతో సందేహం లేదన్న కోర్టు… ఎంతమొత్తం చెల్లించాలన్న అంశంపై తెలంగాణ వాదన వింటే బాగుండేదని పేర్కొంది. బకాయిలు విద్యుత్‌ సంస్థలకు చెందిన అంశంకాగా.. అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలనడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడిరది. రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది.