మరో ‘మిలియన్‌ మార్చ్‌’ జరగాలి

తెలంగాణ ప్రక్రియకు సీఎం గండి కొడుతున్నారు
‘ఇందిరమ్మబాట’ ను అడ్డుకోండి : నిజామాబాద్‌ ఎంపీ యాష్కీ
కోరుట్ల రూరల్‌/ హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చెదరగొట్టేందుకు సీమాంధ్ర నాయకులు కుట్ర చేస్తున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే మరోసారి మిలియన్‌ మార్చ్‌ జరిగి, 2009 తరహా ఉధృత ఉద్యమం రావాలని నిజామాబాద్‌ ఎంపీ మధు యాష్కీ ఉద్వేగంగా అన్నారు. నిజామాబాద్‌ నుంచి మెట్‌పల్లి వెళుతూ మార్గమధ్యలో ఆయన విలేకరులతో సంభాషించారు. ఈ సందర్భంగా యాష్కీ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గండి కొడుతున్నారని విమర్శించారు. కిరణ్‌ తెలంగాణకు వ్యతిరేకి అని, ఎప్పుడు తెలంగాణ అంశం తెర పైకొచ్చినా, దాన్ని పక్కదారి పట్టించేందుకు అనవసర విషయాలను లేవనెత్తుతున్నారని ఆరోపించారు. కాగా, రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగనుందని, అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని కేసీఆర్‌ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలు, నిరాధార ప్రకటనలేనని వెల్లడించారు. కేంద్రం నుంచి తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ఎలాంటి సంకేతాలు గానీ, కసరత్తు గానీ లేవని యాష్కీ స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటివేమైనా ఉంటే కేసీఆర్‌ చెప్తున్న ఆ సంకేతాలు ముందుగా సీఎంకు లేదా పీసీసీ చీఫ్‌కు తెలుస్తాయని, ఇతర పార్టీలకు కాదని వివరించారు. తెలంగాణ విషయంలో కేసీఆర్‌ పదే పదే రకరకాల ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని యాష్కీ వివరించారు. ప్రభుత్వం నిర్వహించే ఇందిరమ్మ బాటను తెలంగాణవాదులు ప్రతిఒక్కరూ అడ్డుకోవాలని అన్నారు.