మహబూబ్‌నగర్‌ జెడ్పీ రణరంగం

C

అరుపులు, కేకలు, ముష్టిఘాతాలు

మహబూబ్‌ నగర్‌ సెప్టెంబర్‌4(జనంసాక్షి):

మహబూబ్‌ నగర్‌ జిల్లా జెడ్పీ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. అరుపులు, కేకలు ముష్టిఘాతాలతో దద్దరిలింది. తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాంమోహన్‌ రెడ్డిపై చేయిచేసుకున్నారు. ఈ దాడికి నిరసనగా టీ కాంగ్రెస్‌ శనివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, రామ్మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడిని కూడా ఆయన ఖండించారు.

వాస్తవానికి జెడ్పీ సమావేశం కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డిలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డిల మధ్య వాదులాట జరిగింది.

ఈ క్రమంలో జరిగిన తోపులాటలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాలరాజుకు గాయాలయ్యాయి. దీంతో, తనపై దాడి చేసిన చిట్టెం రామ్మోహన్‌ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలని బాలరాజు డిమాండ్‌ చేశారు. పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో, గొడవ పెరగకుండా ఇద్దరికీ పోలీసులు నచ్చజెప్పారు.

కాగా, జిల్లా పరిషత్‌ సమావేశం సందర్భంగా రామ్మోహన్‌ రెడ్డిపై దాడి చేసిన అనంతరం అతనిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని బాలరాజు డిమాండ్‌ చేసిన సంగతితెలిసిందే. దళితుడైనందుకే తనపై రామ్మోహన్‌ రెడ్డి చేయి చేసుకున్నారని బాలరాజు ఆరోపిస్తున్నారు.

జడ్పీలో దాడి ఘటన ప్రజాస్వామ్యానికి విఘాతం: జానారెడ్డి

మహబూబ్‌నగర్‌ జడ్పీలో దాడి ఘటన ప్రజాస్వామ్యానికే విఘాతమని తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత జానారెడ్డి అన్నారు. మాట్లాడేందుకు మైక్‌ అడిగితే గుండాయిజం తగదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై దాడి ఘటనను స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకోవాలన్నారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తక్షణమే కేసు నమోదుచేయాలని జానారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. జెడ్పీ సమావేశంలో గొడవపై మూడు కేసులు నమోదు

జెడ్పీ సమావేశంలో శుక్రవారం చోటుచేసుకున్న గోడవపై టూటౌన్‌ పీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి ఫిర్యాదుతో.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గవ్వల బాలరాజు ఫిర్యాదుతో.. రామ్మోహన్‌ రెడ్డిపై అట్రాసిటీ, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాగర్‌కర్నూల్‌ జెడ్పీటీసీ మణెమ్మ ఫిర్యాదుతో.. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌పై 504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.