మహిళలపై అకృత్యాలు

మానవజాతి కొనసాగింపునకు మూలం మహిళ. అన్నింటా సగమైన ఆమె అన్నిరంగాల్లో వెనుకబడే ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి. అనాదిగా కొనసా గుతున్న పితృస్వామ్య వ్యవస్థ మహిళలను మానసికంగా, శారీర కంగా బలహీనపరుస్తూనే ఉంది. ఫలితంగా మహిళలపై వివిధ రకాల దాడులు కొనసాగుతున్నాయని సామాజికవేత్తలు అభిప్రా య పడుతున్నారు. భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి మహి ళలపై వివక్ష కొనసాగిస్తున్నా, బ్రిటిష్‌ పాలనలో మహిళలకు సంబంధించిన సామాజిక దురాచారాల నివారణకు అనేక చట్టాలు రూపొందించారు. వాటి ప్రేరణతో స్వాతంత్ర భారతదేశంలో అనేక చట్టాలను రూపొందించడంతో పాటు వివిధ కమిషన్లు వేసి వాటి అమలుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ చట్టాల అమలులో మాత్రం భారత పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. కమిటీలు, కమిషన్లు కాగితాలకే పరిమిత మయ్యాయి. ఢిల్లీలో పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయపై సామూ హిక అత్యాచారం ఘటన యావత్‌ దేశాన్ని కదిలించింది. ప్రపంచ దేశాలను సైతం నివ్వెరపోయేలా చేసింది. భారతదేశం అంటే సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు అనే నానుడిపై అనేక సందేహా లు వ్యక్తమయ్యాయి. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అదే భారత దేశమంటూ కొలిచేవారు. నిర్భయలాంటి అమానుష ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారత్‌ అంటేనే భయపడాల్సిన పరిస్థితి. భారత్‌లో ఆడబిడ్డగా పుట్టకూడదని భారతమాతే శోకిస్తోం ది. పండు ముదుసలి మొదలు పసి పిల్లల వరకూ కామాంధుల చేతిలో బలవుతూనే ఉన్నారు. అత్యాచారాల్లో వెలుగు చూసినవి, లెక్కకు వచ్చినవే ఆందోళన కలిగించే స్థాయిలో ఉంటే అసలు వెలుగు చూడనవి, పరువు మాటున మరుగు పరిచేవి ఎన్నో తలచుకుంటేనే భయమేస్తుంది. మహిళలపై హింసను నిరోధిం చేందుకు నిర్భయ ఘటనతో కేంద్ర ప్రభుత్వం న్యాయ సవరణ చట్టం-2013ను తీసుకువచ్చింది. చట్టం వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. పసిపిల్లలు, యువతులు, మహిళలపై లైంగికదాడులు ఆగలేదు. భారత సందర్శణకు వస్తున్న విదేశీ మహిళలపైనా అరచకాలకు పాల్పడుతున్నారు కామాంధు లు. మృగాళ్ల చర్యలతో దేశ ప్రతిష్ట మసకబారుతోంది. దేశ రాజధా నిలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. నిత్యం ఢిల్లీలో మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మారుమూల ప్రాంతాల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు, వివిధ సంస్థలు తమ మహిళా ప్రతినిధులను భారత్‌కు పంపాలం టేనే సంశయిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పంపితే వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి, కొన్ని ఆంక్షలు పెట్టి పంపుతున్నాయి. మహి ళలపై జరుగుతున్న లైంగికదాడులకు ఆ తర్వాత ఏర్పడే సామాజిక అసౌకర్యానికి జడిసి వెలుగులోకి రావడం లేదు. పోలీస్‌ స్టేషన్లలో నమోదవుతున్న అత్యాచార, దౌర్జన్య కేసుల సంఖ్య ఎంత ఉందో, సామాజిక అసౌకర్యానికి భయపడి మరుగున పడుతున్నవాటి సంఖ్య అంతకు మించే ఉంటుంది. స్త్రీని ఆదిశక్తి స్వరూపంగా కొలి చిన సనాతన సంస్కృతి మనది. అలాంటి స్త్రీ మనుగడే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. గర్భంలో ఉన్న శిశువు మొదలు బాలికలు, యువతులు, మహిళలు అన్ని దశల్లోనూ అవమానాలు, అఘా యిత్యాలు, అరాచకాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. గర్భస్త శిశవు ఆడపిల్ల అని తేలితే పిండంగానే అంతమొందించడం అలవాటుగా మారింది. 2001 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికల సంఖ్య 927 ఉండగా, ప్రస్తుత 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ సంఖ్య 914కు దిగజారింది. ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక -2013 లైంగిక అసమానతల విషయం లో భారత్‌ తీరు సంతృప్తికరంగా లేదని పేర్కొంది. 148 దేశాల్లో భారత్‌ 132వ స్థానంలో నిలిచింది. భారత్‌ కంటే పేద దేశాలైన పాకిస్థాన్‌ (123), నేపాల్‌, బంగ్లాదేశ్‌ (111)వ స్థానంలో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ సామాజిక దురాగతానికి కుటుం బాలు, వైద్యులు, ఆస్పత్రులు కూడా భాగస్వాములే. పిండదశలోనే గర్భస్త శిశువులను అంతమొందించిన కేసుల్లో కోర్టు వరకూ వచ్చి శిక్ష పడినవి కేవలం 28 శాతం మాత్రమే. పసికందుల నుంచి ముసలి వాళ్ల వరకూ ఎవరినీ వదలకుండా దేశవ్యాప్తంగా సాగు తున్న అఘాయిత్యాల దౌర్భాగ్య సంస్కృతికి జాతి మొత్తం సిగ్గుతో తలదించుకోవాలి. ఇంటిలో, కార్యాలయాల్లో, పనిస్థలాల్లో, విద్యాలయాల్లో ఇలా చెప్పుకుంటే ప్రతిచోట మహిళలపై అకృ త్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. లైంగికహింస, దాడులు, వర కట్న హత్యలు, ఆత్మహత్యలు, పరువు హత్యలు, అమ్మాయిల అక్ర మ రవాణా ప్రమాదకర స్థితిలో సాగుతున్నాయి. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే వాళ్లు సైతం భౌతిక, లైంగిక దాడులకు పాల్పడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యా నికి, దాష్టీకానికి బలై కుమిలిపోతున్న అభాగ్యులు, ఛిద్రమైన సంసారాలు, చీకటి కోటల్లో ఉరేసుకున్న అమాయకుల ఉదంతాలు లెక్కకు మిక్కిలి. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే నేరంగా పరిగణించే పరిస్థితి దాపురించింది. సంబంధ బాంధవ్యా లను మరచి మృగాళ్లు ఎవరిపైనైనా అఘాయిత్యాలకు పాల్పడు తూనే ఉన్నారు. ఇంటర్నెట్‌లో విస్తృతంగా అందుబాటులో ఉన్న అశ్లీల చిత్రాలు, సాహిత్యం, చౌకబారు సినిమాలు, మద్యం, మాదక ద్రవ్యాలు మనిషిలో రాక్షసత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి. యాంత్రిక జీవనంలో కుటుంబం సంబంధాలు బలహీనపడి దారపుపోసలా తెగిపోతున్నాయి. మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందించినా, వాటి అమలులో దృఢ సంకల్పం కరువవుతోంది. చట్టాల అమలుకు ముందుగా పోలీసుల పనితీరులో సంస్కరణలు తీసుకు రావాలి. సౌశీల్యం, సర్దుబాటు, ఎదుటి వారిని ఒప్పించగల సౌశీల్యం పిల్లలకు అలవడేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. బాధ్యతాయుతమైన రేపటి తరాన్ని తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. నైతిక విలువలతో కూడిన విద్యాప్ర ణాళికలు రూపొందించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు సరైన నడవడి అలవర్చడం బోధనాంశాల్లో భాగంగా చేర్చాలి. స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, విద్యాసంస్థలు, మేధావులు కలిసి రావాలి. సాటి వ్యక్తుల పట్ల మర్యాద కనబరచడం జాతి లక్షణమైనప్పుడు లింగ వివక్ష ప్రసక్తే తలెత్తదు. ఇంతటి మార్పు రోజుల వ్యవధిలో సాధ్యపడేది కాదు. ఎప్పటికప్పుడు పురో గతిని సమీక్షించకుంటూ సంకోచిత రాజకీయాలకు సెలవిచ్చి మహి ళల భద్రతకు తద్వారా జాతి గౌరవానికి గొడుగుపట్టి మహో ద్యమానికి పూనుకున్నప్పుడే మహిళలపై హింసతగ్గుతుంది.
– రాధిక గట్టు,
హన్మకొండ.