మహిళా కూలీలపై ఖాకీల దురాగతం

తిరుపతి, జూలై 5 (జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఖాకిల క్రౌర్యం వెలుగుచూసింది. కలికిరి మండలంలో కూలీలపై ఖాకీచకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పొట్టకూటికోసం ఒడిశా ప్రాంతం నుంచి వచ్చిన మహిళా కూలీలపై ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు దురాగతానికి యత్నించారు. కలికిరి లోని ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఒడిశా నుంచి వచ్చిన మహిళా కూలీలు తోట పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. గురువారం అర్ధరాత్రి ఈ మహిళల వద్దకు హోంగార్డులు, కానిస్టేబుళ్లు వచ్చి వారిని ఎక్కడినుండి వస్తున్నారంటూ ప్రశ్నిస్తూ బెదిరించి వెళ్లిపోయారు. తాము ఒడిశా ప్రాంతం నుంచి కూలీ పనుల కోసం వచ్చామని ఆ మహిళలు చెప్పారు. అయితే గురువారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో పోలీసులు మళ్లీ వచ్చి ఆ మహిళలపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆ మహిళలు భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కలనున్న ప్రజలు వచ్చారు. వారిని చూసి పోలీసులు పరారయ్యారు. మద్యం మత్తులో పోలీసులు ఈ అరాచకానికి ఒడికట్టారని స్థానికులు ఆరోపించారు. తెల్లవారిన తర్వాత స్థానిక ప్రజల సహకారంతో బాధిత మహిళలు డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. అత్యాచార యత్నానికి పాల్పడిన పోలీసులు, హోంగార్డులపై కేసు నమోదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హామీ ఇచ్చారు.