‘మార్చ్’కు సర్కారు అనుమతిచ్చింది
బువ్వ.. నీళ్లు.. సంచినిండా బట్టలతో రండి.. తెలంగాణ మార్చ్‌లో కదంతొక్కండి
రేపు మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్ రోడ్డుపై కూర్చోవాలె
ఉద్యోగులందరూ కుటుంబసభ్యులతో రావాలె
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద
్‌హైదరాబాద్ , సెప్టెంబర్ 28 (జనంసాక్షి) : తెలంగాణ జేఏసీ ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ మార్చ్‌కు అనుమతి సాధించిందని, ఈ మార్చ్‌ను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇక తెలంగాణ ప్రజలదేనని టీఎన్‌జీఓల అధ్యక్షుడు దేవీప్రసాద్ వెల్లడించారు. రేపు విజయవంతంగా తెలంగాణ మార్చ్‌ను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో తెలంగాణ ప్రజలు మార్చ్‌లో పాల్గొనేందుకు పూర్తి సన్నాహాలతో రావాలన్నారు. వచ్చేటప్పుడు సద్ది కట్టుకుని, నీళ్లు తీసుకుని, ఓ జత బట్టలతో రావాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకల్లా నెక్లెస్ రోడ్డుకు చేరుకోవాలన్నారు. అదే విధంగా తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల సభ్యులు తమ కుటుంబ సభ్యులతో సహా కవాతుకు కదిలిరావాలని కోరారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి సాధించేందుకు కృషి చేసి హక్కుల సంఘం నేతలు ప్రొఫెసర్ హరగోపాల్, విద్యావేత్త చుక్కా రామయ్య, డాక్టర్ గోపాలకృష్ణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మార్చ్ విజయవంతానికి ఉద్యోగ సంఘాలు ముందుంటాయని ఆయన వివరించారు. ప్రజలందరూ తమ ఆకాంక్షను చాటేందుకు తెలంగాణ మార్చ్ వేదిక కాబట్టి భారీగా తరలివచ్చి తమ గళాన్ని వినిపించాలని దేవీప్రసాద్ పునరుద్ఘాటించారు.