‘మార్చ్‌’ లో సమ్మక్క-సారక్కలవుతం

రాజధానిలో జోరుగా తెలంగాణ మహిళా కవాతు
సాగరహారంలో భాగస్వాములమవుతామని స్పష్టీకరణ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌లో ఆదివాసీ దేవతలు సమ్మక్క-సారక్కల వోలె కదం తొక్కుతామని తెలంగాణ ఆడబిడ్డలు నినదించారు. ఆ తల్లుల స్ఫూర్తి మార్చ్‌లో పాల్గొని, విజయవంతం చేస్తామని ప్రతినబూనారు. బుధవారం తెలంగాణ మహిళలు హైదరాబాద్‌ కవాతు పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ, తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ విమలక్క నాయకత్వంలో తెలంగాణ మహిళలు ఈ
భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో మహిళలు తెలంగాణ అనుకూల నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమ, విమలక్క మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలు కూడా రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మహిళలు తెలంగాణ మార్చ్‌కు భారీగా తరలివచ్చి విజయవంతం చేస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం మార్చ్‌కు అనుమతినివ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ మంత్రులు నిజంగా ఇక్కడి గడ్డ మీదే పుడితే, తెలంగాణ మార్చ్‌లో పాల్గొనాలని, లేకుంటే చరిత్రలో ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోతారని స్పష్టం చేశారు .