మాల్యా నుంచి ప్రతి పైసా వసూలు చేస్తాం

1

– అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ,,మార్చి17(జనంసాక్షి):విదేశాలకు పారిపోయిన  ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా తీసుకున్న ప్రతి పైసాను బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనే అవసరం లేదని అన్నారు.  విజయ్‌మాల్యా వివాదంపై ఓ విూడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయనపై విధంగా స్పందించారు. ఈ కేసుకు సంబంధించిన ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ మాల్యాపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అయితే మాల్యా దేశంవిడిచి పారిపోయాడా అన్న ప్రశ్నపై స్పందించేందుకు మాత్రం జైట్లీ నిరాకరించారు.

దాదాపు 17 బ్యాంకులకు రూ. 9వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్న మాల్యా ఈనెల 2న దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ స్వదేశానికి తిరిగి రాకపోవడంతో ఆయన ఆస్తులను వేలం వేసే పక్రియ గురువారం నుంచి ప్రారంభించారు. అయితే వేలంలో బ్యాంకర్లుకు నిరాశ తప్పలేదు.  బ్యాంకుల నుంచి దాదాపు రూ.9వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో నిందితుడైన వ్యాపారవేత్త విజయ్‌మాల్యా ఇంటి వేలం పక్రియ ముగిసింది. ముంబయి నగర శివారు ప్రాంతమైన జోగేశ్వరిలోని మాల్యా నివాసానికి ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ వేలం నిర్వహించింది. వేలం ప్రారంభ ధర రూ.150కోట్లుగా ఎస్‌బీఐ నిర్ధారించింది. అయితే ఈ వేలానికి ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. సమయం ముగియడంతో వేలం పక్రియ పూర్తయినట్లు బ్యాంకు ప్రకటించింది. ముంబైలోని కింగ్‌ ఫిషర్‌ హౌస్‌ సహా కొన్ని ఆస్తులను బ్యాంకులు ఈ-వేలం ద్వారా విక్రయిస్తున్నాయి. ఆంథేరిలోని 2,401.70 చదరపు విూటర్లు ఉన్న భవనానికి రూ. 150 కోట్లు రిజర్వు ధరగా నిర్ణయించారు. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ బ్యాంకుల నుంచి రూ. 7వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టింది. ఆ సంస్థ దివాళా తీసి మూతపడడంతో గత ఏడాది కింగ్‌ఫిషర్‌ భవనాన్ని ఎస్‌బీఐ స్వాధీనం చేసుకుంది. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్న విజయ్‌ మాల్యా దేశం విడిచి పరారయ్యారు. దాంతో ఆయన ఆస్తులను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించాయి.