మిగులు బడ్జెట్ రాష్టాన్న్రి అప్పుల పాల్జేస్తున్నారు: కాంగ్రెస్
నిజామాబాద్,జూన్20(జనంసాక్షి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మిగులు బడ్జెట్ చూపిస్తే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చూపిస్తోందని డిసిసి అధ్యక్షుడు తాహిర్ బిన్ అన్నారు. కేవలం ఇతర పార్టీల వారిని చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ద ప్రజలపై లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి ఏ ఒక్క పథకం గ్రావిూణ ప్రాంతాల ప్రజలకు అందడం లేదన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కవిూషన్ల పథకాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు టోపీ పెడుతున్నారని మండిపడ్డారు. సామాజిక తెలంగాణగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సోనియాగాంధీ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజల పోరాటంతో పాటు తాము అనేకమార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వివరించామని దీంతో ఆమె తెలంగాణ రాష్టాన్న్రి ఇచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకోలేకపోయామని.. ప్రస్తుతం గ్రామాలకు వెళ్లి ప్రజలకు చెబుతున్నామని పేర్కొన్నారు. సోనియాగాంధీ ఇవ్వకపోతే ఇంకా వందేళ్లయినా తెలంగాణ వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరి వల్లనే ప్రత్యేక రాష్ట్రం రాలేదని చెప్పారు. ఆచార్య జయశంకర్‌తో పాటు కోదండరాం సైతం అన్ని వర్గాలను ఏకం చేసి పోరాటం చేశారని చెప్పారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. అంబేడ్కర్ పుణ్యం వల్ల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగుమమైందని వివరించారు. నిరుపేద ప్రజలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తున్నామని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి ఒక్క ఇంటికీ ఇప్పటివరకు పునాదులు కూడా తవ్వలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను విస్మరించి తన కుటుంబ సభ్యులకు మంత్రుల ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఒక పార్టీ నుంచి గెలిచిన సభ్యుడు ఇతరపార్టీలోకి వెళ్తున్నారని.. ఇలాంటి ఫిరాయింపులను నివారించడానికి కేంద్రం ప్రత్యేకంగా బిల్లు తీసుకురావాలని అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటలు చెప్పకుండా బిల్లు తీసుకువచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విదేశాల పర్యటనకే పరిమితం అయ్యారన్నారు.