మిషన్ భగీరథతో తీరనున్న మంచినీటి సమస్య
ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం: గొంగిడి సునీత
యాదాద్రి భువనగిరి,మే4(జనంసాక్షి): మిషన్ భగీరథ పనులు పూర్తి కావస్తున్నాయని త్వరలోనే ప్రతి గ్రామంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తామని అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఈ వేసవిలోనే నీరు అందుతుందన్నారు. గతంలో బోర్ల వలన ప్రజలు అనేక వ్యాధుల బారిన పడ్డారని ఇప్పుడు ఆ కష్టాలు తీరనున్నాయన్నారు. ముఖ్యమత్రి కేసీఆర్ రూ.50 వేల కోట్లతో మిషన్ భగీరథ ద్వారా నిధులను ఖర్చు చేసి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నట్లు చెప్పారు. ఎన్నికోట్లు నిధులు ఖర్చు చేసైనా కృష్ణా, గోదావరి నదుల నుంచి నీరు తీసుకొచ్చి ప్రజలకు అందించి ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. వ్వవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఘనత కెసిఆర్‌దేనని దేశంలో ఎక్కడా కూడా 24గంటల కరెంట్‌ను సరఫరా చేయడం లేదన్నారు. గతంలో రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసేవారని, ఇప్పుడు 24 గంటల విద్యుత్ వద్దని ధర్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు రోడ్లు లేని గ్రామాలు నియోజకవర్గంలో లేవన్నారు. గ్రామాలలో రూ.ఐదు లక్షల నుంచి కోటి రూపాయాల వరకు నిధులు కేటాయించి సీసీ రోడ్లు నిర్మాణ చేపట్టామని చెప్పారు. ప్రైవేటు దవాఖానలలో పేదలు ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేసి సిబ్బంది కొరత లేకుండా చేసి పేదలకు మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానలలో డెలవరీ అయిన మహిళలకు ఆర్థిక సహాయంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. తల్లి బిడ్డలకు మూడు నెలల పాటు సరిపడే కేసీఆర్ కిట్టు అందిస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల వెంట ఉంటూ పార్టీ శ్రేణుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు. యాదాద్రి జిల్లాలో మొత్తం 17 మండలాల్లో మూడు విడుతలుగా నిర్వహిస్తున్నారు. తొలి విడుతలో చౌటుప్పల్, రామన్నపేట, వలిగొండ, భూదాన్ పోచంపల్లి మండలాలు, మలి విడుతలో తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూర్, గుండాల, మూడో విడుతలో ఆత్మకూరు, బొమ్మలరామారం, భువనగిరి, బీబీనగర్, మోత్కురు, అడ్డగూడూరు మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడుత ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనుండడంతో ఉదయమే ఆమె పలు గ్రామాల్లో ప్రచారానికి వెళ్లారు.
రాజాపేట, ఆలేరు మండలాల్లో విస్త్రత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట జడ్పీటీసీ టీఆర్‌ఎస్ అభ్యర్థి తొటకూరి అనురాధాబీరయ్య మండలంలోని చిన్న గౌరాయిపల్లి, చిన్నకందుకూరు, అహ్మద్‌నగర్‌లో ప్రచారం చేశారు. మోటకొండూర్ టీఆర్‌ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి పల్లా వెంకట్‌రెడ్డి మండలంలోని కొండాపురం, చాడ, ముత్తిరెడ్డిగూడెం, గడ్డగొల్లబావి ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి ఓట్లు అభ్యర్థించారు.