మీసేవ దేశానికే తలమానికం

దిగ్వి‘జయ’మే మాకు ఆదర్శం : సీఎం కిరణ్‌
హైదరాబాద్‌, జూలై 1 (జనంసాక్షి) :
మీ సేవ దేశానికే తలమానికమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన 20 సూత్రాల ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ముఖ్య అథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ ప్రారంభించారు. మీ సేవ ద్వారా 150 సేవలందిస్తున్నామన్నారు. ప్రజలకు నేరుగా సేవలందించాలన్న లక్ష్యంతోనే ‘మీసేవ’ను ప్రారంభించామన్నారు. క్రమంగా ప్రజలతో మీసేవ మమైకమైందన్నారు.అలా ఎదుగుతూ నేడు ఒక ఉన్నత స్థాయికి చేరుకుందన్నారు. ఇటీవల ఒక్కరోజులోనే 1,80,000మందికి సేవలందించిందని చెప్పారు. పాలనలో పారదర్శకత కోసమే ‘మీసేవ’ చేపట్టామన్నారు. ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగే పని ప్రజలకు తప్పిం దన్నారు. సర్టిఫికెట్ల జారీలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించామని చెప్పారు. రెవెన్యూ, ఐటీ శాఖల సమన్వయం వల్లే మీసేవ విజయవంతమైందన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన సేవలను కూడా ‘మీసేవ’ ద్వారా అందించడం హర్షదాయకమని అన్నారు. అనంతరం మీసేవ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలందేలా కృషి చేసిన 12 జిల్లాల కలెక్టర్లకు పురస్కారాలను అందజేశారు. పురస్కారాలను అందుకున్న వారిలో కొందరి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌, విజయనగరం కలెక్టర్‌ కాంతిలాల్‌ దిండే, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ విజయకుమార్‌, నెల్లూరు కలెక్టర్‌ బి.శ్రీధర్‌, కర్నూలు కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, కడప కలెక్టర్‌ శశిధర్‌, చిత్తూరు కలెక్టర్‌ సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌ (ఆయన తరఫున మరొకరు అందుకున్నారు), రంగారెడ్డి కలెక్టర్‌ వాణిప్రసాద్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ రిజ్వి, నల్గొండ కలెక్టర్‌ ముక్తేశ్వరరావు, ఖమ్మం కలెక్టర్‌ నరేష్‌, కరీంనగర్‌ కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ తదితరులు అందుకున్నారు. 20సూత్రాల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా మూడుసార్లు ఉత్తమ పురస్కారం లభించడం హర్షదాయకమని ముఖ్యమంత్రి అన్నారు. 20 సూత్రాల కమిటీ చైర్మన్‌ తులసీరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, గల్లా అరుణ, గీతారెడ్డి, దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దిగ్విజయ్‌సింగ్‌ మాట్లాడుతూ 20 సూత్రాల అమలు కమిటీకి ఉత్తమ పురస్కారాలు రావడం అభినందనీయమన్నారు. 20 సూత్రాల అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలవడం అభినందనీయమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మీసేవ’ దేశానికే తలమానికంగా నిలిచిం దన్నారు. మీసేవ వల్ల కింది స్థాయిలో అవినీతికి ఆస్కారముండదని అన్నారు. పేదలకు సేవలందిం చేందుకు అనేక పథకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 20 సూత్రాలు పేదలకు సంబంధించినవన్నారు. వాటిని అమలయ్యేలా చూడడం ఆషామాషీ కాదన్నారు. సమష్టి కృషి వల్లే ఆ కమిటీకి మూడు సంవత్సరాల పాటు వరుసగా ఉత్తమ పురస్కారాలు రావడం హర్షణీయమన్నారు. 1992లో ఇందిరాగాంధీ హయాంలో ఒకసారి ప్రధమస్థానం లభించిందన్నారు. అలాగే ప్రస్తుతం మూడు సంవత్సరాలకు గాను ఉత్తమ పురస్కారం రావడం అభినందనీయ మన్నారు. సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా నన్నారు. మీసేవ ద్వారా మరో 17 కొత్త సేవలు అమలు కావడం అభినందనీయమన్నారు. పరిపాలనలో దిగ్విజయ్‌సింగ్‌ తమకు ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతామని అన్నారు.