ముందస్తుకు అవసరమేమొచ్చింది
– హడావిడిగా ఫైళ్ల క్లియరెన్స్ తో కోట్లు చేతులు మారుతున్నాయి
– వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలి
– తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం
జగిత్యాల, ఆగస్టు28(జనం సాక్షి) : మధ్యంతర ఎన్నికల అవసరం ఏమొచ్చిందో చెప్పాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం ఆయన జగిత్యాలో విలేకరులతో మాట్లాడుతూ… హడావిడిగా ఫైళ్లు ఎందుకు క్లియర్ చేస్తున్నారని, ఫైళ్ల క్లియరెన్స్ లో ఎన్ని కోట్లు చేతులు మారుతాయోనని అన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలి అని కోదండరాం అన్నారు. ఇన్నాళ్లు సచివాలయ మొహం చూడకుండా ఉన్న సీఎం కేసీఆర్, ఇప్పుడు ఫైళ్లు దుమ్ము దులుపుతున్నారని, నేల మాలిగాల్లో దాగిన ఫైళ్ల పై ఇప్పుడెందుకు సంతకాలు పెడుతున్నారని కోదండరాం ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేఖ విధానాలతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రోజుకో పథకాన్ని తెరపైకి తెస్తున్న కేసీఆర్.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. ఫలితంగా అరచేతిలో వైకుంఠం చూపుతూ వచ్చే ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కోదండరాం ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.



