ముంపుకు గురైన గ్రామాలను పర్యటించిన జడ్పిటిసి పోశం నరసింహారావు

పినపాక నియోజకవర్గం జూలై 16 ( జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నారం, కమలాపురం, చిన్నరాయి గూడెం గ్రామాలను శనివారం మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముంపుకు గురైన కుటుంబాల బాధితులను కలిసి వారి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గోదావరి ప్రవాహం వల్ల సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. వరద ముంపుకు గురైన ఇంటి పరిసర ప్రాంతాల్లో విష పురుగులు చేరే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మురికి నీరు బురదవల్ల విష జ్వరాలు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామంలో సానుకూల వాతావరణం ఏర్పడేంతవరకు త్రాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రత్యేక పారిశుద్ధ వైద్య కార్యక్రమాలని ప్రజల సమన్వయంతో నిర్వహిస్తామని ఆయన అన్నారు. ముంపు గ్రామాలు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ప్రత్యేక బాధ్యతతో అధికార యంత్రాంగం తో పాటు పార్టీ శ్రేణులు సైతం పనిచేస్తారని ఆయన తెలిపారు ఈ పర్యటనలో ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షులు కురి నాగేశ్వరరావు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు ఎంపీపీ కారం విజయ కుమారి మున్సిపల్ కమిషనర్ కే మాధవి మున్సిపల్ ఏఈ సత్యనారాయణ ఆత్మ కమిటీ చైర్మన్ మేడ నాగేశ్వరరావు టిఆర్ఎస్ నాయకులు ఉద్దండు బొలిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.