ముంపుకు గురైన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డిమాండ్: కనకయ్య

బూర్గంపహాడ్ జూలై 12(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతుల పత్తి చేలు నీట మునగటం, వరి నారు కూడా నీటిలో మునిగి రైతులకు నష్టం జరిగిందన్నారు. పంట నష్టాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సారపాక, రెడ్డిపాలెం వెళ్లే రోడ్డు పూర్తిగా ముంపుకు గురైందన్నారు. భద్రాచలం ప్రాంతంలో కరకట్ట కట్టారు. బూర్గంపహాడ్ ప్రాంతంలో కూడా కరకట్ట నిర్మించాలని, గోదావరి వచ్చిన ప్రతి సంవత్సరం ముంపునకు గురవుతున్న గ్రామాలలో పునరావాస ఏర్పాట్లు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. వారం రోజులయిన తర్వాత మళ్లీ వారి ఇళ్ళకి పంపిస్తున్నారని, ప్రతి ఏటా వారి యొక్క జీవన ఉపాధి దెబ్బతింటుందని, ఇంట్లో కూడా సామాన్లు కొన్ని వదిలేయడం వల్ల తడిసి పాడైపోతున్నాయన్నారు. బీరువాలు, డబల్ కాట్ మంచం, టీవీలు, ఫ్రిజ్లు ఇతర పెద్ద వస్తువులు కూడా ఇంట్లోనే వదిలేసి పునరావాసాలకు వెళ్తున్నారన్నారు.  ముంపుకి గురవుతున్న గ్రామాలకి రోడ్లు, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కరకట్టనేది చాలా ముఖ్యం అని, పోలవరం ప్రాజెక్టు అనేది పూర్తి అయిపోతే ఈ  మండలంలో ఏ ఒక్క గ్రామం కూడా మిగిలే పరిస్థితి లేదని, అందువల్ల కారకట్ట కట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, బత్తుల రాజేష్, రావులపల్లి చిట్టిబాబు, కారం హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.