ముంబయిలో భారీగా హవాలా సొత్తు స్వాధీనం


రూ. 2,500 కోట్లకు పైగా పట్టివేత
రహస్యంగా తరలిస్తుండగా పట్టుకున్న ఎన్‌ఐఏ, ఐటీ
ముంబై, జూలై 2 (జనంసాక్షి) :
ముంబయిలో వేళ్లూనుకున్న హవాలా రాకెట్‌ రక్కసి వెలుగు చూసింది. గుట్టుగా తరలిస్తున్న భారీ నిధి రట్టయింది. వాణిజ్య రాజధాని ముంబైలో పెద్ద ఎత్తున సొత్తు లభ్యమైంది. నగదు, ఆభరణాలతో కూడిన 150 బ్యాగులు.. నాలుగు ట్రక్కులలో అక్రమంగా తరలించేందుకు యత్నించగా పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఆదాయపన్ను శాఖ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) భారీ సొత్తును స్వాధీనం చేసుకుంది. ముంబైలోని సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ వెలుపల లభ్యమైన నగదు ఎంత అనేది విలువ ఇంకా తేలలేదు. అయితే, ఈ భారీ నిధి రూ.2,500 కోట్లకు పైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నాలుగు ట్రక్కుల్లో దాదాపు 150 సూట్‌కేసుల్లో రూ.2,500 కోట్ల నగదును ముంబై నుంచి గుజరాత్‌కు తరలిస్తుండగా.. ఐటీ, ఎన్‌ఐఏ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అందులో భారీగా నగలు కూడా ఉన్నట్లు సమాచారం. దాదాపు వారం రోజుల పాటు కసరత్తు చేసి హవాలా గుట్టును రట్టు చేశారు. గత రాత్రి అందిన సమాచారంతో అప్రమత్తమైన అధికారులు.. పక్కా వ్యూహంతో నగదను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అంత భారీ మొత్తంలో నగదు అక్రమ రవాణా వెనుక ఎవరైనా ప్రముఖుల హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే 47 మంది  అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇన్‌ఫార్మర్‌ ఫోన్‌ కాల్‌తోనే…
ిఇన్‌ఫార్మర్‌  ఫోన్‌ కాల్‌ ఆధారంగా భారీ నిధి గుట్ట రట్టయింది. వారం రోజుల క్రితం ఒకరు ఎన్‌ఐఏ అధికారులకు ఫోన్‌ చేసి, పెద్ద సంఖ్యలో నగదు, నగలు, వజ్రాలు ముంబయి నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నాడని సమాచారమిచ్చాడు. దీంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ, ఐటీ శాఖ అధికారులు వారం రోజులుగా నిఘా పెట్టారు. సోమవారం రాత్రి గుజరాత్‌ మెయిల్‌లో ఈ మొత్తాన్ని తరలించేందుకు ముంబై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు తరలిస్తుండగా, వలపన్ని పట్టుకున్నారు. ‘150కి పైగా బ్యాగులతో కూడిన నాలుగు ట్రక్కులను సీజ్‌ చేశాం. 40 మంది వరకు అదుపులోకి తీసుకున్నామని’ ఐటీ శాఖాధికారులు మంగళవారం తెలిపారు. 50 బ్యాగుల్లో లభ్యమైన నగదు లెక్కింపు కొనసాగుతోందని, మిగతా బ్యాగుల్లో ఏముందో చూడాల్సి ఉందన్నారు. ఒక్కో ట్రక్కులో 35 బ్యాగులు, 15 మంది ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయా బ్యాగుల్లో భారీగా నగదు, నగలు ఉన్నాయని పేర్కొన్నాయి. హవాలా వ్యాపారం కోసమే ముంబై నుంచి గుజరాత్‌కు ఈ డబ్బు తరలిస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపాయి. సొత్తును ఐటీ శాఖాధికారులు స్వాధీనం చేసుకోగా, నిందితులను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ డబ్బు ఎక్కడిది? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న వ్యక్తులెవరు? విదేశీ హస్తం ఉందా? వంటి అంశాలతో పాటు ఉగ్రవాదుల కోణంలోనూ ఆరా తీస్తున్నారు.