ముగ్గురు ఇంచార్జి రిజిస్టర్ లపై వేటు..
నిజామాబాద్ బ్యూరో,ఫిబ్రవరి 11,(జనంసాక్షి):నిజామాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన ముగ్గురు ఇంచార్జి సబ్ రిజిస్ట్రేషన్ పై వేటు పడేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 1 వ తేదీ నుంచి మార్కెట్ విలువల పెంపు నేపథ్యంలో గత నెల చివర్లో ఇక్కడ పెద్దసంఖ్యలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ సమయంలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ సబ్ రిజిస్ట్రార్లుగా ఉన్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అందినకాడికి దండుకున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్లు కావటం గమనార్హం. నాలా ఫీజు చెల్లించని, అనుమతిలేని లేఅవుట్లలో ప్లాట్ల క్రయవిక్రయాలకు వీరు సేల్ డీడ్‌లు తయారు చేశారని, భూమి ఒకరిదే అయినా.. పంచుకున్నట్లు (స్టాంపు రుసుము ఎగవేత కోసం) పత్రాలు సృష్టించారని సమాచారం. ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆ శాఖ కమిషనర్ శేషాద్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ కమిటీ ఏర్పాటైంది. దర్యాప్తులో భాగంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ మధుసూదన్‌రెడ్డి అక్రమాలను గుర్తించారు. ఆ ముగ్గురు ఉద్యోగులపై వేటు వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.