మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి మతోన్మాద అవకాశవాద రాజకీయాలను ఓడించాలి
గరిడేపల్లి, ఆగస్టు 21 (జనం సాక్షి): మునుగోడు ఉప ఎన్నికల్లో సిపిఐ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఈ నిర్ణయాన్ని పార్టీ కార్యకర్తలు హర్షిస్తూ స్వాగతిస్తున్నారని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు.ఆదివారం గరిడేపల్లి లో గ్రామ సిపిఐ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం లో బిజెపి రెండవసారి అధికారం లోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మతోన్మాద రాజకీయాలు చేస్తూ దేశంలోని మేధావులు కళాకారులు పాత్రికేయులు విప్లవ భావాలు వున్న వారిని తీవ్ర వాదం పేరుతో ఎన్కౌంటర్ జైలు పాలు చేస్తూ ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. దేశంలోని సంపద మొత్తం అంబానీ అదాని లకు దోచి పెడ్తూ దేశాన్ని అప్పుల పాలు చేయటమే కాక దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి అక్రమంగా తాము గద్దెనెక్కుతూ ప్రజల తీర్పును కూడా వమ్ము చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని ఎన్నికైన సభ్యులతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు తెస్తున్నారని ఈ పరిస్థితులలో లౌకిక శక్తులు మొత్తం ఒక్కటై బిజెపి ని ఓడించి తెరాస ను భారీ మెజారిటీతో గెలిపించి మత రాజకీయాలకు చెక్ పెట్టాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు త్రిపురం సుధాకర్ రెడ్డి, గరిడేపల్లి గ్రామ సిపిఐ కార్యదర్శి యడ్ల అంజిరెడ్డి, సహాయ కార్యదర్శి ప్రతాని సైదులు, బొందయ్య, శేషయ్య, పున్నయ్య, బండ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.