మురికి కడిగే దిశగా కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అవినీతి ఊబిలోంచి బయటపడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యూపీఏ-1, 2 ప్రభుత్వాల ఏలుబడిలో అవినీతి మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగింది. సచ్చీలుడైన మన్మోహన్‌సింగ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టి పార్టీ ప్రముఖులే సూత్రధారులు, పాత్రధారులు అవినీతి, కుంభకోణాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. యూపీఏ -1 హయాంలో చాపకింద నీరుగా సాగిన అవినీతి, రెండో సారి అధికారం చేపట్టాక బట్టబయలైంది. మొదటి యూపీఏ సర్కారు ఏలుబడిలోనే పరుడు పోసుకున్న 2జీ స్పెక్ట్రమ్, రెండో సారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత వెర్రితలలు వేసింది. స్పెక్ట్రమ్‌ల కేటాయింపులో అశ్రిత పక్షపాతం, బంధుప్రీతి తేటతెల్లమైంది. దానికి ఫలితంగా ఓ కేంద్ర మంత్రి, యూపీఏలోని ప్రధాన రాజకీయ భాగస్వామ్య పార్టీ అధినేత కుమార్తె జైలు పాలయ్యారు. యూపీఏ-1లోనే అంకురార్పణ జరిగిన ఇటీవల వెలుగులోకి వచ్చిన మరో స్కామ్ అగస్టా హెలీక్యాప్టర్ల కుంభకోణం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా దేశంలోని 12 మంది వీవీఐపీలకు అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడిన హెలీక్యాప్టర్లను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ బాధ్యతను అప్పటి ఎయిర్‌చీఫ్ మార్షల్ త్యాగికి అప్పగించింది. దీనినే అదనుగా చేసుకొని ఆయన బిడ్డింగ్ నిబంధనలు మార్చి అగస్టావెస్ట్‌ల్యాండ్‌కు బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించడంతో పాటు ఆ సంస్థకే టెండర్ దక్కేలా కుట్ర పన్నాడని ఇటలీ దర్యాప్తు బృందం అభియోగాలు నమోదు చేసింది. అంతకుముందు భారత్‌లో ప్రతిపక్షాలు చాపర్ల కొనుగోలులో కుంభకోణం జరిగిందనే అనేక పర్యాయాలు ఆరోపణలు గుప్పించినా కేంద్రం పట్టించుకోలేదు. ఇటలీ దర్యాప్తు బృందం రంగంలోకి దిగడంతో కేంద్రం అనివార్యంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. చాపర్ల కొనుగోలు సంబంధించిన పాపాల పుట్ట పగులుతోంది. యూపీఏ హయాంలో వెలుగులోకి వచ్చిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణమే దేశంలో అతిపెద్దని అనుకుంటే దాన్ని తలదన్నే కుంభకోణం బొగ్గు బ్లాకుల కేటాయింపులతో వెలుగు చూసింది. కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో కుంభకోణం. ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతి యావత్ దేశాన్ని చుట్టేసింది. యూపీఏకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీతో పాటు తమిళనాడుకు చెందిన రాజకీయ భాగస్వామి డీఎంకే కుంభకోణాల్లో మునిగితేలింది. ఆ పార్టీ నుంచి కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్న రాజా, కరుణానిధి కుమార్తె కనిమొళి జైలు పాలయ్యారు. అగస్టా కుంభకోణంలో త్యాగి విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీని శంకించలేం కాని పరిపాలన వ్యవహారాల్లో ఆయన పట్టుకోల్పోయారని మాత్రం అనుకోవచ్చు. బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అసమర్థ ప్రధాని వల్లే దేశం కుంభకోణాలమయమై పోయిందని ప్రతిపక్షాలు కోడైకూశాయి. యూపీఏ అవినీతి ఆరోపణలపై ఎదురుదాడికి దిగిందే తప్ప నిర్మాణాత్మక చర్చలు, చర్యల ద్వారా దానిని రూపుమాపే ప్రయత్నమే చేయలేదు. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ నివేదికను అటార్ని జనరల్, ప్రధానమంత్రి కార్యాలయం, న్యాయశాఖ మంత్రి ముందుగానే చూసి పలు సవరణలు చేసినట్టుగా సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా సుప్రీం కోర్టుకు తెలిపారు. దీనిపై పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. చివరికి న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్ ఉద్వాసనకు దారితీసింది. బొగ్గు నివేదికను సీబీఐ కేంద్రంతో పంచుకోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేసింది. కేంద్రం సీబీఐని పంజరంలో బంధించి అధికారం చెలాయిస్తోందని, దానిని బంధవిముక్తం చేయాలని సూచించింది. లేనిపక్షంలో ఆ పని తాము చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. ఈ ఎపిసోడ్ సాగుతున్న క్రమంలోని రైల్వేశాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ మేనల్లుడు విజయ్‌సింగ్లా ఓ ఉన్నతాధికారి నుంచి రూ.90 లక్షలు తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ తర్వాత బన్సల్ మాట్లాడుతూ, తన మేనల్లుడితో ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. కానీ ఆయన నిత్యం రైల్వే మంత్రి కార్యాలయంలో, ఇంట్లోనే కనిపించేవాడని, డబ్బులు తీసుకుంటున్న సమయంలోనూ తన మేనమామతో మాట్లాడి ఉన్నత పదవి ఇప్పిస్తానని చెప్పాడు. ఇందుకోసం రూ.12 కోట్లతో డీల్ కుదుర్చుకున్నాడు. బన్సల్‌పై అవినీతి ఆరోపణలు ఇవే మొదటిసారి కావు. ఆయన కుటుంబానికి మేళ్లు చేకూర్చేలా, ఆదాయం సమకూర్చునేలా అధికారాన్ని ఉపయోగించడాని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇంతకాలం ఆరోపణలను వినీ విననట్లు ముందుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకు కారణం 2014 సార్వత్రిక ఎన్నికలు. ఎన్నికల వేళ అవినీతి అంశం తమకు అడ్డంకి కాకూడదనే కాంగ్రెస్ పార్టీ కళంకితులపై వేటు వేస్తోంది. ఇందుకు కారణం కర్ణాటక ఎన్నికల ఫలితాలేనని చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి చర్చ జరుగకుండా అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. దీనిని ప్రపంచ మీడియా పతాక శీర్షికల్లో ప్రచురించింది. అసమర్థ ప్రధాని వల్లనే దేశంలో ఈ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు, ప్రతిష్టలు మంటగలిసేలా వ్యవహరించిన వారిపై ఆలస్యంగానైనా చర్యలకు ఉపక్రమించడం ఆహ్వానించదగ్గ పరిణామం.