మేడారం హుండీల లెక్కింపు

497 హుండీలను తెరచిన అధికారులు
హనుమకొండ,ఫిబ్రవరి23(జనం సాక్షి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని హుండీల లెక్కింపు
పక్రియ ప్రారంభమయింది. హనుమకొండ తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో హుండీలలోని డబ్బును లెక్కిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు మూడు వందలకుపైగా మంది పాల్గొంటున్నారు. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 497 హుండీలను తెరచిన అధికారులు.. భక్తులు సమర్పించిన కానుకలను వేరుచేస్తున్నారు. డబ్బును వేర్వేరుగా కట్టలుగా కడుతున్నారు. రోజువారీ ఆదాయాన్ని బ్యాంకుల్లో జమచేయనున్నారు. కాగా, దేశం నలుమూలల నుంచి వచ్చిన కోటి మందికి పైగా భక్తులు ఈ జాతరలో పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రెండేండ్ల క్రితం జరిగిన జాతర సందర్భంగా భక్తులు భారీగా బంగారం, వెండి వస్తువులను అమ్మవార్లకు కానుకలుగా సమర్పించారు. సుమారు రూ.11.64 కోట్లకు పైగా కానుకలు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.