– మేయర్‌ పీఠం నుంచి లక్ష్మీనారాయణ ఔట్‌

– అవిశ్వాసానికి అనుకూలంగా 38మంది ఓటింగ్‌
– విప్‌నుసైతం ధిక్కరించిన కాంగ్రెస్‌ కార్పొరేటర్లు
పెద్దపల్లి, ఆగస్టు2(జ‌నం సాక్షి) : రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకొన్నారు. పట్టుబట్టీ మరీ మేయర్‌ లక్ష్మీనారాయణపై అవిశ్వాసం పెట్టారు. మేయర్‌ పీఠం నుంచి లక్ష్మీనారాయణను దింపివేశారు. గురువారం అవిశ్వాస ప్రక్రియ అనుకున్న మేరకే జరిగింది. మేయర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాసానికి అనుకూలంగా 38మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ కార్బోరేటర్లు సైతం మేయర్‌ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అవిశ్వాసానికి అసలు హాజరు కావద్దని బుధవారం కాంగ్రెస్‌ పార్టీ విప్‌ జారీ చేసింది. ఈ మేరకు జేసీకి లేఖ అందించింది. అయినా పలువురు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించి లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా అవిశ్వాసంలో పాల్గొన్నారు. దీంతో విప్‌ను ధిక్కరించిన వారిపై కాంగ్రెస్‌ ఏమి చర్యలు తీసుకొంటుందో ఆసక్తి నెలకొంది. మరోవైపు టీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్‌ లక్ష్మీనారాయణ మధ్య గత కొంత కాలంగా పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది.  మేయర్‌ అవిశ్వాసం విషయంలో రాజకీయాలకు సైతం గుడ్‌బై చెబుతానని గతంలో సోమారపు ప్రకటించారు. సొంత పార్టీ మేయర్‌ పైనే అవిశ్వాసానికి రంగం సిద్దం చేశారు. దీంతో ఈ విషయమై పార్టీ నాయకత్వం సైతం గతంలో ఎమ్మెల్యేను మందలించింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. రాజకీయాలకు గుడ్‌ బై చెబుతానని ప్రకటించారు. దీంతో మంత్రి కేటీఆర్‌ సోమారపుని బుజ్జగించారు. ఈ నేపథ్యంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే మేయర్‌ అవిశ్వాసం విషయంలో ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదని పట్టుబట్టారు. మేయర్‌ అవిశ్వాసానికి కార్పోరేషన్‌ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా 28మంది టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు ఓటు చేశారు.  కాంగ్రెస్‌ కి చెందిన 17మంది కార్పోరేటర్లు పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేశారు. దీంతో మేయర్‌ తన పదవి కోల్పోయారు.  అవిశ్వాసానికి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ తో పాటు ఆరుగురు కార్పొరేటర్లు, ముగ్గురు కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేటర్‌ గైర్హాజరయ్యారు. లక్ష్మీనారాయణపై  అవిశ్వాసం ప్రతిపాదించేందుకు ఎమ్మెల్యే చొరవ చూపడంపై టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది.