మొక్కల రక్షణ బాధ్యత విద్యార్థులదే: కలెక్టర్‌

మంచిర్యాల,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): విద్యార్థులు నాటిన మొక్కలను దత్తత తీసుకొని వాటిని పెంచేలాఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. విద్యాశాఖ ,అటవీ శాఖ అధికారులు సమన్వయంతో కలిసి హరితహారంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షించేలాగా కృషి చేయాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించి, వాటిని దత్తత తీసుకొని పెంచేలాగా ప్రోత్సహించాలన్నారు. అడవుల రక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. వన్యప్రాణులను వేటాడే వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహిస్తోందని, ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. వానలు బాగా కురవాలని, కోతులు అడవులకు వెళ్లాలనే నినాదంతో ముఖ్యమంతి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. ఇప్పటికే మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు.లక్ష్యాన్ని చేరుకునేందుకు పట్టణంలోని ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.