మొదటి టెస్టుపై నీలినీడలు
వరుణడు అడ్డు తగిలే అవకాశం
భారీ వర్షాలు కురిసే ఛాన్స్
సెంచూరియన్,డిసెంబర్21(జనం సాక్షి): టీమిండియా డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్ టీమిండియాకే కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా చాలా కీలకం. భారత జట్టు ఇప్పటి వరకు సిరీస్ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికా. కెప్టెన్సీ వివాదాన్ని మర్చిపోయి కోహ్లీ.. ఆఫ్రికాలో భారత జట్టు చరిత్రను మార్చాలనుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో వన్డే-టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ , రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేరు. కీలకమైన ఆటగాళ్లు టెస్టు జట్టుకు దూరమైనా దక్షిణాఫ్రికాను ఓడిరచే సత్తా ఇండియాకు ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. గత 29 ఏళ్లగా ఏ భారత జట్టు కెప్టెన్‌కు సాధ్యం కాని ఫీట్‌ను విరాట్ కోహ్లీ చేసి చూపెట్టాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో, ఈ టెస్ట్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ టెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయ్. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ కు వరుణడు అడ్డు తగిలే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తోన్నాయ్. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ జరిగే 26,27 తేదిల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే, మిగతా రోజుల్లో కూడా ఆకాశం మేఘావృతమై.. చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రతాపరమైన చర్యలు చేపట్టింది. తొలి టెస్ట్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. అంతేకాకుండా దేశీయంగా నాలుగు రోజులపాలు జరిగే మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు సీఎస్‌ఏ ప్రకటించింది.
‘‘డొమిస్టిక్ క్రికెట్‌లో డివిజన్ వన్ (డిసెంబర్ 19-22) ఐదో రౌండ్ మ్యాచ్‌లను వాయిదా వేయాలని నిర్ణయించాం. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బయో బబుల్ వెలుపల పోటీలు జరుగుతున్నందున రక్షణ చర్యగా వాయిదా వేయాలని అనుకున్నాం. ఇక భారత్‌తో జరిగే ఫస్ట్ టెస్ట్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు ‘‘ అని సీఎస్‌ఏ అధికారి వెల్లడిరచారు.
అయితే వాయిదా పడిన దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను నూతన సంవత్సరంలో ఖరారు చేస్తామని తెలిపారు.ఇప్పటికే.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు సౌతాఫ్రికాలో అడుగు పెట్టింది. టెస్టు సిరీస్ కోసం ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు.ఇప్పటి వరకు ఆఫ్రికా గడ్డ మీద ఒక్క సిరీస్‌ను గెలుచుకోని టీమిండియా.. చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది. తొలి టెస్టు డిసెంబర్ 26-30, రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.