మోడీ ఆశలపై నీళ్లు
సార్వత్రిక ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి పెద్ద షాకే ఇచ్చాయి. భారతీయ జనతా పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టే ఏకైక సమ్మోహన శక్తిగా చెప్పుకునే నరేంద్రమోడి కర్ణాటకలో ప్రచారం చేసినా ఆ పార్టీకి ఎంతమాత్రం లాభించలేదు. నరేంద్రమోడి ప్రచారం చేసిన ప్రతిచోట పార్టీ ఓడిపోయింది. కొన్ని చోట్ల ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నరేంద్రమోడి జాతీయ స్థాయి నేత అని ఆ పార్టీ చేసుకునే ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. కర్ణాటకలో బీజేపీ పాలన చోటు చేసుకున్న అవినీతి, ప్రజాసంపద లూటీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశమైంది. దీనిని ఎదుర్కొనేందుకు బీజేపీ అవినీతి పరులుగా ప్రచారంలో ఉన్న 30 మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. అయినా ఆ పార్టీపై ఉన్న అవినీతి ఆరోపణల ప్రభావం మాత్రం తగ్గలేదు. బళ్లారి కేంద్రంగా సాగిన ఇనుప ఖనిజం తవ్వకాలు, అక్రమ రవాణా, గాలి బ్యాచ్ అపర కుభేరుల అవతారమెత్తడం ఈ మొత్తం వ్యవహారం వెనుక భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉందనే ప్రచారం కాంగ్రెస్‌కు లాభించిందనే చెప్పాలి. రెండు పర్యాయాలు ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇవ్వకపోవడంతో తలెత్తిన విపరిణామాల ప్రభావం ప్రజలపై పడింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి గద్దెపై కూర్చోబెట్టారు కన్నడీగులు. ఏడేళ్ల తర్వాత రాష్ట్ర విధాన సభలో అధికారపక్షంగా కాంగ్రెస్ అవతరించింది. 224 మంది ఎమ్మెల్యేలుండే శాసనసభలో ఈనెల 5న 223 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ అభ్యర్థి మృతిచెందడంతో పెరియపట్నం స్థానానికి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 121 స్థానాలు సాధించింది. సాధారణ మెజార్టీ 113 మందికాగా కాంగ్రెస్ పార్టీ తరఫున అదనంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. 2008లో జరిగిన ఎన్నికల్లో 80 పార్టీలకే కాంగ్రెస్ పరిమితమైంది. ఈ ఎన్నికల్లో 41 మంది ఎమ్మెల్యేల బలం అదనంగా కాంగ్రెస్‌కు తోడైంది. క్రితం సారి 110 ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ఇండిపెండెట్ల సాయంతో అధికారాన్ని చేపట్టిన బీజేపీ ఈసారి 70 స్థానాలు కోల్పోయింది. జనతాదళ్(సెక్యులర్) క్రితం సారికంటే 12 మంది ఎమ్మెల్యేల ను అధనంగా సంపాదించుకోగలిగింది. బీజేపీతో విభేదించి కర్ణాటక జనతా పక్ష పార్టీ పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు నడ్డి విరిగింది. 223 స్థానాల్లో పోటీ చేసిన కేజేపీ కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలుపొందింది. మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్‌రెడ్డి ఆశీస్సులతో ఆయన అనుచరుడు శ్రీరాములు ఏర్పాటు చేసిన బీఎస్‌ఆర్ పార్టీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఈపార్టీ 190 స్థానాలకుపైగా స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. బీఎస్‌ఆర్ పార్టీని మినహాయిస్తే 12 చోట్ల ఇండిపెండెంట్లు, ఇతరులు విజయడంకా మోగించారు. తమ నుంచి విడిపోయి కొత్త పార్టీలు పెట్టుకోవడం వల్లే పరాజయం పాలయ్యామని బీజేపీ నాయకులు పరాజయానికి కొత్త భాష్యం చెప్తున్నారు. అది నిజమే కావొచ్చు కూడా. నరేంద్రమోడి నిజంగా జనాకర్షణ ఉన్న నేతే అయితే ఈ చిన్నపాటి అడ్డంకులు అంతగా ప్రభావం చూపొద్దు. కానీ అధికార బీజేపీ ఏకంగా 70 స్థానాలను కోల్పోయింది. కేజేపీ, బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లు మొత్తం కలిపి పది మాత్రమే. కానీ ఆ రెండు పార్టీలు చీల్చిన ఓట్లే అధికార పక్షాన్ని చావుదెబ్బతీశాయి. ఆ రెండు పార్టీల నేతలపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలున్నాయి. అవినీతే ప్రాధాన ప్రచారాస్త్రంగా సాగిన ఎన్నికల్లో వారిని వెంటే పెట్టుకున్నా బీజేపీకి అంతగా ప్రయోజనం ఉండకపోయేది. జాతీయ స్థాయిలో అవినీతికంటే స్థానికంగా చోటు చేసుకున్న అవినీతినే ప్రజలకు ఎక్కువగా పట్టించుకున్నారని కర్ణాటక ఎన్నికలను బట్టి తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఏ అంశాలను ప్రధానాస్త్రాలుగా చేసుకోవాలో తెలియని పరిస్థితి. నరేంద్రమోడి హిందుత్వ ఎజెండా తమను గట్టున పడేస్తుందనే నమ్మకం కర్ణాటక ఎన్నికల పుణ్యమా అని వ్యతిరేక సంకేతాలు ఇచ్చింది. బీజేపీ ఎన్ని కుప్పిగంతులు వేసినా కన్నడ ప్రజలను వాటిని పట్టించుకోలేదు. ఈక్రమంలో ఆ పార్టీ భావి ప్రధానిగా చెప్పుకునే మోడినీ విస్మరించారు. ఆయన చెప్పిన మాటలనూ లక్ష్యపెట్టలేదు. ఐదేళ్ల సుస్థిర పాలనకే ఓటర్లు మొగ్గు చూపారు. చీటికిమాటికి ఎన్నికలు రావడం, ముఖ్యమంత్రులను మార్చడం వల్ల విసుగెత్తి కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. నిజానికి కాంగ్రెస్ గెలుపునకు తామే కారణం అని చెప్పుకునే స్థితిలో స్థానిక నాయకత్వం లేదు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చరిష్మాతోనే ఎన్నికల్లో గెలిచినట్లుగా స్థానిక నాయకులు చెప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటక విజయం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరటనే ఇచ్చింది. అదే సమయంలో బీజేపీకి, మోడికి విషాదాన్ని మూటగట్టింది. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీ(యూ), బిజూ జనతాదళ్ వ్యతిరేకిస్తున్నాయి. నితీశ్‌కుమార్, నవీన్ పట్నాయక్ తమ రాష్ట్రాలకు ప్యాకేజీలు అత్యధిక నిధులు తెచ్చి మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ రెండు పార్టీలు ప్రస్తుతం యూపీఏ వైపే చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని నరేంద్రమోడి, హిందుత్వ ఎజెండా గట్టెక్కిస్తాయా అనేది మిలియన్ డాలర్ల ప్ర0శ్న. ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రెండు ప్రధాన రాజకీయ పక్షాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. బీజేపీలో ఆ ప్రకంపనల ప్రభావం హెచ్చుస్థాయిలో ఉంది.