మోతెపై వరాల జల్లు
– డ్రిప్ ఇరిగేషన్‌లో ఆదర్శం కావాలి
– రైతులకు 100శాతం సబ్సీడీతో బిందుసేద్య పరికరాలు
– మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
– సీఎం కేసీఆర్ పిలుపు
నిజామాబాద్,జులై6(జనంసాక్షి):
తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన మోతె గ్రామంపై ముఖ్యమంత్రి వరాలజల్లు కురిపించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మోతె గ్రామానికి వరాల జల్లు కురిపించారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అందించిన కోర్కెల చిట్టాలో ఉన్న అన్ని అంశాలకు సరేనన్నారు. ఇది నావూరు. నావూరు బాగాలేకపోతే నా ఇజ్జతే పోతుంది కనుక అన్ని విధాలా మోతెను అభివృద్ది చేసేందుకు హావిూల జల్లు కురింపించారు. వాటికి పాలనాపరమైన ఆమోదాలు ఇచ్చి నిధులు విడుదల చేస్తానని సిఎం కెసిఆర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మోతె జడ్పీ పాఠశాలలో సీఎం మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. మోతె కేసీఆర్ సొంత ఊరు. కేసీఆర్ సొంత ఊరు మోతె ఎట్ల ఉండాలె. ఎవరైనా చూస్తే మెచ్చుకోవాలి. కేసీఆర్ సీఎం అయి మోతె బాగుపడకపోతే బయట పతార ఖరాబయితది. మోతె ప్రజల ఆశీర్వచనం.. భగవంతుడి దయతో తెలంగాణ వచ్చింది. మోతెను మరిచిపోను. మోతె మట్టి తీసుకెళ్లి ఊళ్లల్లోని బావుల్లో కలిపితె బాగుంటుంది. ఈ మట్టి ద్వారా ఇక్కడి ప్రజల మాదిరిగా అందరూ బలంగా అవుతారు. మోతె మట్టి అంత పవర్‌పుల్ అంటూ చేసిన ప్రసంగం ప్రజల్ల ఉత్తేజాన్ని నింపింది. గ్రామంలోని రైతులందరికీ కులవర్గాల భేదాలు లేకుండా వందశాతం రాయితీతో బిందు సేద్య పరికరాలు అందజేస్తామన్నారు. అలాగే ఇక్కడి 3800 ఎకరాల్లో 3000 వేల ఎకరాలు వర్షపాతం ద్వారానే సాగు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మోతె గ్రామంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదని.. వారికోసం రెండు పడక గదులతో 200 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఆధునిక సౌకర్యాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాలుగు నెలల్లో రెండస్తుల పంచాయతీ భవనం నిర్మిస్తామన్నారు. మురుగు కాలువల కోసం రూ.2.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.మోతెలో ఇండ్లు లేని వారి ఉండొద్దు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్స్ కట్టిస్తామన్నారు. గ్రామపంచాయతీ భవనానికి రూ. 80 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సీసీ రోడ్లు, మోరీల నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ నిధులు సరిపోక పోతే ఎంపీ కవిత తన ఫండ్స్ నుంచి రూ. 50 లక్షలు మంజూరు చేస్తారన్నారు. అత్యాధునిక ప్రమాణాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టిస్తాం. 5 ఎంఏ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను పదిరోజుల్లోనే మార్పిసానని అన్నారు. హరితహారంలో అందరూ పాల్గొని మోతె పరువు నిలపాలన్నారు. అందుకు అనుగుణంగా మోతెలోనే నర్సరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక విూరు మొక్కలు బయటికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మిగతా గ్రామాలకు 40 వేల మొక్కలు ఇస్తున్నాం. మోతె గ్రామానికి ఒక వెయ్యి మొక్కలు ఎక్కువనే ఇస్తాం. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలి. ఇక గ్రామాభివృద్ధి నేను చూసుకుంటా. చెట్ల పెంపకం విూరు చూసుకోవాలి. వానలను అయితే నేను తీసుకు రాలేను. వానలు రావాలంటె చెట్లు నాటాలి. చెట్లు నాటినప్పుడే వర్షాలు బాగా కురుస్తాయి. కోతులను అడవులకు వాపస్ పంపాలంటే అంతా మొక్కలు నాటాలన్నారు. కోతులు ఊళ్లలోకి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు హరితవనం లో భాగస్వములు కావాలని అన్నారు.మోతే తన సొంత గ్రామం అని ఆయన ప్రకటించారు. వారం రోజుల్లోగా మోతె రైతులుందరికీ కుండీలు కూడా మంజూరు చేస్తాం. మోతెలో నూటికి నూరు శాతం డ్రిప్ ఇరిగేషన్‌తో పంటలు పండించాలె. పసుపు ఫ్లాట్ ఫామ్‌లు వంద శాతం సబ్సిడీతో కట్టిస్తాం. మోతె ఇక పచ్చగా కనిపించాలె. రైతులు సంతోషంగా ఉండాలన్నారు.
మోతెకు గోదావరి జలాలు
మోతె గ్రామానికి గోదావరి జలాలు తీసుకొస్తామని, గోదావరి జలాలతో రైతులు పంటలు పండించాలని సిఎం కెసిఆర్ అన్నారు. . కాళేశ్వరం ద్వారా మోతె గోదావరి జలాలు వస్తాయి. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తా. గ్రామంలోని 3800 ఎకరాల్లో 3 వేల ఎకరాలు వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. వాటిని తడిపేందుకు గోదావరి జలాలు వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో అన్ని లఫూట్ స్కీము లు అమలు చేశారని అవేవి సరిగా పనిచేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేయవలసిన అవసరం ఉందని అన్నారు.నిజాం సాగర్ నుంచి నీరు గ్రావిటీ ద్వారా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆయా ప్రాజెక్టులను పరిశీలించి తాను కూడా ఇంజినీర్ అయ్యానని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మోతే గ్రామం మట్టిని తెలంగాణ అంతటా బావులలో చల్లాలని , అంత ధైర్యం చూపిన చరిత్ర ఇక్కడి ప్రజలదని ఆయన అన్నారు. మోతే గ్రామానికి అవసరమైన అన్ని వసతులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకప్పుడు నిజామాబాద్ ధనిక మైన ప్రదేశం కాగా,ఇప్పుడు ఇక్కడ నుంచి గల్ప్ కు వలస పోవలసిన దుస్థితి వచ్చిందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.