యధేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ 

పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు?
జగిత్యాల,మే16(జ‌నం సాక్షి): ప్రభుత్వం హరితహారం పేర కోట్లు వ్యయం చేసి మొక్కలను నాటుతుంటే మరోవైపు మొక్కలను తొలగించి అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా ఆక్రమణ పర్వం సాగుతున్నా కనీసం కన్నెత్తి చూసే వారే కరవయ్యారు. వేల ఎకరాలు అటవీ భూములతోపాటు గతంలో పెంచిన మొక్కలను నరికివేసి సాగు చేసుకుంటున్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. బీర్‌పూర్‌ మండలంలో గత కొన్నేళ్లుగా అటవీశాఖ ద్వారా గ్రామస్థుల భాగస్వామ్యంతో భారీ ఎత్తున మొక్కలను నాటారు. ఏపుగా పెరగడంతో వాటిని విక్రయించారు. ఆయా పరిధిలోని గ్రామాలతోపాటు అటవీశాఖకు ఆదాయం సమకూరింది. అదే ప్రాంతాలలో మళ్లీ మొక్కల పెంపకం చేపట్టారు. ఏపుగా పెరుగుతున్న వాటిని నరకివేసి వాటిని కాల్చేస్తున్నారు. ఆ తర్వాత ఆ
భూములను యథేచ్ఛగా సాగుకు అనువుగా చేసుకుని ఆక్రమించు కుంటున్నారు. బీర్‌పూర్‌ మండలంలోని శివారులోని అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.ఈ విషయం సంబందిత అటవీశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గతంలో అటవీ సరిహద్దు వెంట తవ్విన కాంటూరు కందకాలను కూల్చివేసి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఆక్రమణలపై కొంత మంది యువకులు ఫోను ద్వారా, వాట్సప్‌ల ద్వారా అధికారులకు రహస్యంగా సమాచారం అందించి, ఫొటోలను పంపించినా చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు
తీసుకున్నప్పుడే ఆక్రమణలను నిలవరించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారుల దూర భారం కూడా తగ్గడమే కాకుండా సవిూపంలోనే రేంజ్‌, సెక్షన్‌ అధికారులు ఉన్నప్పటికీ అడవుల నరికివేతతోపాటు భూముల ఆక్రమణ కొనసాగుతునే ఉంది. ఇలా ఆయా పరిధిలోని 11 గ్రామాల పరిధిలో వీరు నిఘా ఉంచాల్సి ఉన్నప్పటికీ ప్లాంటేషన్లను నరికివేస్తున్నా పట్టించుకోవడంలేదు. అయితే ఎక్కడో అటవీ మధ్యనున్న నర్సరీలలో కాకుండా రహదారి పక్కనే ఉన్న నర్సరీలను నరికివేసి సాగు చేస్తున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.