యాదవుల ఆర్థికాభివృద్ధికోసమే గొర్రెల పంపిణీ
– వాటి సంక్షేమానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంది
– పాడి- పంటలు బాగుంటేనే రైతు అభివృద్ధిసాధ్యమవుతుంది
– పాడికోసం త్వరలోనే గేదెల పంపిణీకి చర్యలు
– రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
– సిరిసిల్లలో రెండవ విడత గొర్రెల పంపిణీని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, తలసాని
రాజన్నసిరిసిల్ల, జులై2(జనం సాక్షి ) : తెలంగాణ నివసించే యాదవులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తుందని, వీటిని ప్రతి ఒక్క యాదవ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణలక్ష్మీ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి సోమవారం ప్రారంభించారు. గొర్రెల పంపిణీ సందర్భంగా లబ్దిదారులకు 30 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గతేడాది 60 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. వాటి సంఖ్య ఇప్పుడు 80 లక్షలకు చేరుకుంది. క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేశాకే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణలో యాదవులు ధనవంతులు కాబోతున్నారని స్పష్టం చేశారు. గొర్రెలకు గ్రాసం, వైద్యం, బీమా వంటి అంశాలపై సీఎం ఆలోచించారు. గొర్రెలను పంపిణీ చేసిన తర్వాత వాటి సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తుందన్నారు. గొర్రెల పంపిణీ కోసం సీఎం కేసీఆర్ రూ. 5 వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఏడాది గొర్రెల పంపిణీ కోసం ఇంకా ఎక్కువనే నిధులు ఇస్తామన్నారు. విదేశాలకు మాంసం పంపిణీ చేసే స్థాయికి ఎదగాలన్నారు. మత్స్యకారులను ఆదుకునేందుకు రూ. వెయ్యి కోట్లతో చేపల పెంపకం చేపట్టామని తెలిపారు. పాడి – పంట బాగుంటేనే రైతు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పాడి కోసం త్వరలోనే గేదెలను పంపిణీ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతకు అండగా నిలుస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.