యాసంగిపంట కేంద్రం కొనాలి
` తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్
హైదరాబాద్,నవంబరు 10(జనంసాక్షి):యాసంగిపంటను కేంద్రం కొనాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘వరి ధాన్యం కొనుగోలు` కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ, టీఆర్ ఎస్, టీడీపీ, కాంగ్రెస్ నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ‘‘అన్ని మంచిగనే ఉన్నయి.. అల్లుడు నోట్లో శని అన్నట్లు ఉంది తెలంగాణ పరిస్థితి.రాష్ట్రంతో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు చాలా అనుమానాలు ఉన్నాయి.వరి పత్తి కిందనే చాలా భూమి ఉంది. రైతులకు ఇవే ప్రధాన పంటలు అయ్యాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులు చెరుకు పంట వేసేందుకు అనుకూలంగా ఉన్నారు. నిజాం షుగర్స్.. తెరవాలంటున్నారు.పామాయిల్ దిగుమతి చేసి నువ్వులు.. పల్లీ పంటలను ప్రభుత్వాలు సమాధి చేశాయి. తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఎప్పటి నుంచో వేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి.రైతు ఏ రైస్ పెట్టినా కొనాలి.ఎగుమతి.. దిగుమతులపై కేంద్రం మార్గం చూపాలి.బ్రిటిష్ వాళ్లు నీలి మందు వేయాలని రైతులపై ఒత్తిడి పెట్టినట్టే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి.వరి సాగు పై అనుమానాలు నివృత్తి చేయాలి.యాసంగి వరి పంట మొత్తం కేంద్రం కొనాలి. విపరీతమైన దిగుమతులు ఆపాలి.కేంద్ర తెచ్చిన కొత్త అగ్రీ చట్టాలు వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగమే.దిగుమతి.. ఎగుమతి విధానాలపై రైతు దృష్టి తో కేంద్రం చర్యలు తీసుకోవాలి.కేంద్రమే ప్రత్యామ్నాయ పంటలపై ముందుకురావాలి.రాష్ట్ర ప్రభుత్వం రైతులపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది.కోటగోడలు దాటను.. ఎవరితోను మాట్లాడను.. అన్ని నాకే తెలుసు అనే ధోరణి సీఎం కేసీఆర్ వీడాలి.రైతులకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే పాపం అవుతుంది.’’ అని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ జగపతిరావు, రవీంద్ర బాబు,రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్‌నేత అన్వేష్ రెడ్డి, టీఆర్‌ఎస్ నేత బచ్చు శ్రీనివాస్,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి,
బీజేపీ రాష్ట్ర నేత సంగప్ప,ఏఐకేఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ చలపతి రావు,టీడీపీ ప్రతినిధి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.