రంజీ కింగ్‌ ముంబై ష40వ సారి ట్రోఫీ దక్కించుకున్న జట్టు షమూడోరోజే చేతులెత్తేసిన సౌరాష్ట్ర

ముంబై ,జనవరి 28:ఊహించినట్టుగానే రంజీ ట్రోఫీ ఫైనల్‌ ఏకపక్షంగా ముగిసింది. 76 ఏళ్ళ తర్వాత తుది పోరుకు అర్హత సాధించి రికార్డు సృష్టించిన సౌరాష్ట్ర , ముంబై చేతిలో చిత్తుగా ఓడింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఫైనల్‌లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ 124 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలిరోజు నుండే పూర్తి ఆధిపత్యం కనబరిచిన ముంబై 40వ సారి టైటిల్‌ కైవసం చేసుకుంది. జాఫర్‌ సెంచరీతో 6 వికెట్లకు 287 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై ధాటిగా ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు ఆలౌటైంది. హికెన్‌ షా 55 , అంకిత్‌ చవాన్‌ 41 పరుగులతో రాణించారు. ముంబైకి 207 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. వెంటనే రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్ర అనూహ్యంగా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 100 పరుగులు దాటగా… రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముంబై బౌలర్లు అగార్కర్‌ , కులకర్ణి సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ను దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషించారు. ఒక దశలో 34 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే ఔటయ్యారు. వీరిలో ముగ్గురు ఖాతానే తెరవలేదు. అయితే చివర్లో సనాందియా , జడేజా కాసేపు ప్రతిఘటించడంతో స్కోర్‌ 80 దాటింది. చివరకి సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో కులకర్ణి 5 , అగార్కర్‌ 4 వికెట్లు పడగొట్టారు. రికార్డ్‌ సెంచరీతో అదరగొట్టిన వసీం జాఫర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. ఈ విజయంతో రంజీ హిస్టరీలో ముంబై 40వ సారి ఛాంపియన్‌గా నిలిచింది.