రఘునందన్‌ ఏం చేద్దామని?

టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత రఘునందన్‌రావు తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను అవినీతి పరులుగా చిత్రీకరించి తెలంగాణ వ్యతిరేకుల ఎదుట పలుచన చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. తెలంగాణవాదం అతడ్ని నాయకుడిగా మలిస్తే ఆ వాదాన్నే తనకు మళ్లే అంగడి సరుకుగా మార్చే విష ప్రయత్నం చేస్తున్నాడు. టీఆర్‌ఎస్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా అందరికీ సుపరిచితుడైన రఘునందన్‌రావు, కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరుంది. కేసీఆర్‌ సొంత జిల్లా వాడు కావడం, న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం, వాగ్దాటి ఆయనకు కీలకనేతగా గుర్తింపునిచ్చింది. తెలంగాణ ఉద్యమం పక్షాన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న వారిపై ఆయన ఎటాక్‌ చేసే తీరును అధినేత పలు సందర్భాల్లో మెచ్చుకున్నట్లు చెప్తుంటారు. పార్టీ కీలక నేతల్లో ఒకరిగా ఉన్న రఘునందన్‌కు అన్ని వ్యవహారాలను అతి దగ్గరగా చూసే అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల్లో ఈ అంశమే కీలకంగా మారనుంది. తెలంగాణవాదం తప్ప వేరే ప్రాధాన్యాంశాలు లేవనే స్థితి పది జిల్లాల ప్రజలు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని ఉద్యమ నేతలను తక్కువ చేసి చూపేందుకు సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తమకు తెలిసిన మేనేజ్‌మెంట్‌ వల విసిరాయి. ఇంతకాలం ఉద్యమానికి నమ్మిన బంటులా ఉన్న రఘునందన్‌ ఆ వలకు ఈజీగానే చిక్కారు. అంతా ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లోకి వలస వస్తుంటే ఆయన అందుకు భిన్నంగా తెలంగాణ ప్రధాన వ్యతిరేకపార్టీ తెలుగుదేశానికి చేరువయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయి ఉద్యమ ద్రోహానికి పాల్పడ్డాడు. దీనిని పసిగట్టిన టీఆర్‌ఎస్‌ అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. అప్పటికే ఉద్యమ ద్రోహానికి, మాతృగడ్డ విముక్తి పోరాటానికి వ్యతిరేకిగా మారిన రఘునందన్‌ తన సస్పెన్షన్‌ను సాకుగా చూపి మొత్తం ఉద్యమానికి అవినీతి మకిలీ అంటించే ప్రయత్నం చేశాడు. టీఆర్‌ఎస్‌ తెలంగాణ పేరుతో పాల్పడ్డ అక్రమ వసూళ్ల చిట్టా తన వద్ద ఉందని, దానిని బయట పెడతానని ఇంతకాలం బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు చేసిన రఘునందన్‌ మంగళవారం కోఠీలోని సీబీఐ కార్యాలయంలో జేడీ లక్ష్మీనారాయణను కలిసి కొన్ని డాక్యుమెంట్‌లు అప్పగించినట్లుగా చెప్పాడు. ప్రసుత్త జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరుపుతున్న సీబీఐ జేడీకి పలు విషయాలు వెల్లడించినట్లుగా పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ వసూలు చేసినట్లుగా చెబుతున్న నిధులకు సంబంధించిన కీలక పత్రాలు ఆయనకు ఇచ్చి విచారణ జరపాలని కోరానని నిస్సిగ్గుగా తెలిపాడు. సీమాంధ్ర వ్యక్తులు తెలంగాణ పత్రికల్లో పెట్టుబడి పెట్టడాన్ని ఆయన తప్పుబట్టాడు. తెలంగాణ వనరులు దోచుకొని కోట్లకు పడగలెత్తిన వాళ్లు ఆ డబ్బును తమ ప్రాంతానికి తీసుకెళ్లి వ్యాపారాలు చేసుకుంటే తప్పు. తద్వారా ఆ ప్రాంతం వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కానీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ తెలంగాణ పత్రికల్లో, ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివిధ సంస్థల్లో పెట్టుబడి పెడితే తప్పేంటో అంతు పట్టడం లేదు. టీఆర్‌ఎస్‌ రాజకీయ పార్టీ. మిగతా అన్ని పార్టీల మాదిరిగానే ఆ పార్టీకి వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు పార్టీ ఫండ్‌ రూపంలో నిధులు ఇస్తాయి. అలా ఇచ్చిన నిధులకు పన్ను రాయితీ ఉంది. కాబట్టి ఆ నిధులకు రశీదులు ఇవ్వడం మామూలే. అలాంటి రశీదులను చూపి రఘునందన్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలకు తెరతీయడం నీతిబాహ్యమైన చర్య. ఉద్యమ పార్టీలో కీలక నేతగా ఉన్న సమయంలో ఆ పార్టీ వ్యవహారాలు చూసుకోవడం పరిపాటి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో బహిష్కరించినప్పుడు తాను తప్పు చేయలేదని చెప్పుకోవాలి. తన సచ్చీలతను నిరూపించుకోవాలి. కానీ రఘునందన్‌ వీటిలో ఏ ఒక్క ప్రయత్నం చేయలేదు. తాను ఎవరిని కలువలేదని మొదట బుకాయించి హరీశ్‌రావు వైఎస్సార్‌ను కలిస్తే లేని తప్పు తాను చంద్రబాబు కలిస్తే వచ్చిందా అంటూ ఎదురుదాడికి దిగాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకి, వచ్చిన తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబును ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎవరి ప్రోద్భలంతో ఈ దుస్సాహసానికి ఒడిగట్టాల్సి వచ్చిందో ఆయన తెలంగాణ ప్రజలందరికీ వివరణ ఇవ్వాల్సి ఉంది. దీనిని పక్కనబెట్టి తాను మాత్రమే సచ్చీలుడిని అని చెప్పుకునేందుకు ఉద్యమ పార్టీని, ఆ పార్టీకి వచ్చిన నిధులను, నాయకులను దోషులుగా చూపి తెలంగాణ వ్యతిరేక శక్తులు చేసే అబద్ధపు ప్రచారానికి ఊతమివ్వడం విచారకరం. ఈ చర్యకు పాల్పడిన రఘునందన్‌ ఇప్పుడు తనను తాను సమర్థించుకోవచ్చేమో గాని ప్రజల దృష్టిలో దోషి కాకుండా పోడు. సీమాంధ్ర పెత్తందారుల ఏజెంట్‌గా మారిన రఘునందన్‌ ఏం చేద్దామని సీబీఐ జేడీని కలిశారో అంతుచిక్కడం లేదు. ఆయన లక్ష్యం మొత్తం ఉద్యమాన్ని బలిపెట్టడమే అన్నట్టుగా అనిపిస్తోంది. అలాంటి చర్యకు పాల్పడే ద్రోహులకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రఘునందన్‌ ఒక్కడినే కాదు ఆయన్ను ప్రోత్సహించే సీమాంధ్ర పెట్టుబడిదారీవర్గానికి కూడా బుద్ధి చెప్పక తప్పదు.