రాఖీ పౌర్ణమి రోజూ కొనసాగిన వీఆర్ఏల సమ్మే

రాఖీ కట్టి మద్దతు తెలిపిన సర్పంచ్ రజిత-యాదగిరి
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 12 : వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 19 రోజులుగా మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న నాలుగు మండలాల వీఆర్ఏ లు శుక్రవారం రాఖీ పౌర్ణమి రోజు కూడా సమ్మెలో ఉండటాన్ని చూసి సర్పంచుల సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామ సర్పంచ్ ఆలేటి రజిత-యాదగిరి వీఆర్ఏల అందరికీ రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి వారి సమ్మెకు మద్దతు తెలుపారు. ఈసందర్భంగా
వారు మాట్లాడుతూ.. గత 19 రోజులుగా వీఆర్ఏలు శాంతియుతంగా సమ్మెచేస్తూ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు పేస్కేల్ అమలు చేస్తానని, ఉద్యోగ భద్రత కల్పిస్తానని కనీస వేతనం అమలు చేస్తానని, అర్హులైన వాళ్లకు పదోన్నతులు కల్పిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మాట తప్పడం వల్ల వీఆర్ఏలు సమ్మెకు దిగారని దీనితో రెవెన్యూ కార్యాలయాలలో, గ్రామాలలో రెవెన్యూ పనులు కుంటుపడ్డాయన్నారు. దీనివల్ల ప్రజలు, రెవెన్యూ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వారి న్యాయమైన కోరికలను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జేఏసీ జిల్లా కార్యదర్శి కర్ణాకర్, నాలుగు మండలాల జేఏసీ అధ్యక్షులు రాజలింగం, నాయకులు భూపాల్, వెంకటేశం, సురేష్, శివకుమార్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.