రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా
– చేయాలనుకున్న పనులు చేయలేక పోతున్నా
– టీఆర్ఎస్లో తనకు గౌరవం లభించటం లేదు
– ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చినా అధికారాలు ఇవ్వలేదు
– అవినీతి పరులను పార్టీ ప్రోత్సహిస్తుంది
– పార్టీలో క్రమశిక్షణ లోపించింది
– టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సంచలన నిర్ణయం
– మేయర్ అవిశ్వాస విషయంలో మనస్థాపం చెందిన ఎమ్మెల్యే
రామగుండం,జులై9(జనం సాక్షి): చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నానని అందుకే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామగుండం మేయర్ అవిశ్వాస పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన సింగరేణి కార్మికులు, రామగుండం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం సింగరేణి కార్మికులతో భేటీ అయిన ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్లో తనకు గౌరవం లేదని అన్నారు. పార్టీలో అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చినా అధికారాలు ఇవ్వలేదని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందని వ్యాఖ్యానించారు. పదవుల్లో ఉంటానని… విధులకు హాజరుకానని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు.
మేయర్ అవిశ్వాసంపై తీర్మానం వ్యవహారంలో ఎమ్మెల్యే మనస్థాపం..
తెలంగాణలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గత నెలతో నాలుగు సంవత్సరాల గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా మున్సిపాలిటీలతో పాటు, పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో వర్గం పోరు ఎక్కువగా కొనసాగుతోంది. దాదాపుగా 20కిపైగా మున్సిపాలిటీలో అధికారపార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్లపై, అధికార పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా రామగుండం మున్సిపాలిటీలో వర్గ పోరు ఇటు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇండిపెండెట్ అభ్యర్థి లక్ష్మీనారాయణను అధిష్టానం మేయర్‌గా నియమించింది. అయితే ఆయన వ్యవహారశైలిని మొదటి నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా మేయర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాల అవిశ్వసాస తీర్మాన గడువు గత నెలలో ముగియడంతో మేయర్‌పై కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. నేడో రేపో అవిశ్వాస తీర్మానం జరగాల్సి ఉండగా అధిష్టానం ఆదేశాల మేరకు నోటీసులు వెనక్కి తీసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకువచ్చారు. అధిష్టానం నుంచి ఒత్తిళ్లు ఏర్పడుతున్న నేపథ్యంలో తాను పార్టీలో కొనసాగలేనని సోమారపు సత్యనారాయణ నిర్వేదం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం సింగరేణి కార్మికులతో భేటీ అయిన ఆయన ఇకపై రాజకీయాల్లో కొనసాగలేనని ప్రకటించారు.