రాష్ట్ర పనితీరును దేశానికి చాటిచెప్పేందుకే
‘ప్రగతి నివేదన’ సభ
– సభకు స్వచ్చదంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు
– నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించాం
– దసరా, దీపావళి నాటికి అన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ నీరు
– విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్
కరీంనగర్, ఆగస్టు30(జనం సాక్షి) : రాష్ట్ర పనితీరును దేశానికి చాటిచెప్పేందుకే ‘ప్రగతి నివేదన’ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభను కనీవినీ ఎరగని, మునుపెన్నడూ జరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలుసైతం స్వచ్చంధంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం కరీనగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రేషన్ డీలర్ల కవిూషన్ 20పైసల నుంచి 70పైసలకు పెంచామని, సెప్టెంబర్1 నుంచి అది అమల్లోకి వస్తుందన్నారు. బియ్యం కార్డును ఇతర పథకాలకు లింక్ చేయకపోవడంతో నకిలీ లబ్ధిదారులు కొంత తగ్గారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సంక్షేమం కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఈటెల తెలిపారు. బ్యాంకులకు సంబంధం లేకుండా లక్షల మందికి స్వయం ఉపాధి సహాయం అందించబోతున్నట్లు తెలిపారు.
ఆయాకులాల ఆత్మ గౌరవ ప్రతీకలుగా కుల సంఘాల భవనాలు నిర్మిస్తున్నామని, అశ్రిత, సంచార జాతుల కోసం 10 ఎకరాల్లో రూ. 10కోట్లతో సంచార భవన్ కడుతున్నట్లు ఈటల తెలిపారు. జనాభా ప్రాతిపదికన మిగతా కులాల వారికి కూడా భవనాలు కట్టిస్తామని, అన్ని కులాల వారు సెప్టెంబర్ 2న తమ కృతజ్ఞతను ప్రకటించేందుకు ప్రగతి నివేదన సభకు తరలి వస్తారని ఈటెల చెప్పారు. రాష్ట్ర పనితీరును దేశానికి చాటిచెప్పేందుకు ఈ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నట్లు ఈటెల స్పష్టం చేశారు. ఊరికో ట్రాక్టరు చొప్పున 1వ తేదీన ట్రాక్టర్లు బయలుదేరాలని, కరీంనగర్ జిల్లా నుంచి 3వేల బస్సులు, వెయ్యికి పైగా ట్రాక్టర్లు, వేల సంఖ్యలో కార్లు, సుమోలలో జనం కొంగర కలాన్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈటెల పేర్కొన్నారు. ఇప్పటికే సభ విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఈటెల అన్నారు. కరీంనగర్ జిల్లాలో పార్టీ నాయకత్వమంతా ఒకే గొంతుతో పనిచేస్తామన్నారు. మిషన్ భగీరథ కింద ఇప్పటికే 50శాతం నీళ్లుస్తున్నామని, దసరా, దీపావళి నాటికి మిగతా ప్రాంతాలకు తాగునీరు అందిస్తామన్నారు. దేశంలోనే ఇంత గొప్ప పథకం ఎక్కడా లేదని ఈటెల పేర్కొన్నారు. ఏప్రిల్ కంటే ముందే ఎన్నికలు వస్తాయని ఊహిస్తున్నామని ఈటెల పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చే వాళ్లు ఉంటారు..పోయే వాళ్లు ఉంటారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.