రికార్డు ధర పలికిన మిర్చి
ఎనుమాముల మార్కెట్లో క్వింటా ధర 32వేలు
వరంగల్,మార్చి3(జనం సాక్షి): మిర్చి పంట రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఈసారి మిర్చి పంట దిగుబడి తగ్గినా..ధరలు పెరగడంతో రైతులు సంతోషిస్తున్నారు. గురువారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశి రకం మిర్చికి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ. 32 వేలు ధర పలికింది. దేశి రకం మిర్చికి ఇక్కడ ఇంత రేటు పలకటం మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. క్వింటాల్ ధర రూ. 32 వేలు పొందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన రైతు భిక్షపతిని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి సన్మానించారు. మార్కెట్ అధికారులు బీవీ రాహుల్, చందర్ రావు, భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.