రూ.వెయ్యికోట్లు వ్యవసాయరంగం యాంత్రీకరణకు కేటాయింపుమంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడి
నెల్లూరు, ఆగస్టు 3 : వ్యవసాయరంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్షీనారాయణ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆయన వ్యవసాయ అధికారులతో ఖరీఫ్ సీజన్, వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు తదితర అంశాలపై సమీక్షి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా రైతులు కొత్త పోకడలు అవలంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే సాంకేతికంగా భారత్ ఎంతో వెనుకబడి వుందని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయంలో యాంత్రీకరణ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ఇప్పటికే కుప్పనూర్పిడి, వరినాట్లు, మెరక ప్రదేశాలు సమం చేయడం తదితర వంటి పనులకు యాంత్రీకరణ పరికరాలను సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్నదని అన్నారు. వ్యవసాయరంగానికి సంబంధించి శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న కొత్త వంగడాల మీద, తక్కువ నీటితో యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించే వరి రకాలపైన రైతులు అవగాహనను పెంచుకోవాలని సూచించారు. మంత్రి అనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సోమశిల, తెలుగు గంగ ప్రాజెక్టుల కింద సుమారు ఆరున్నర లక్షల ఎకరాల ఆయకట్టు భూమి సాగుతోందని అన్నారు. సోమశిల నీటి సామర్థ్యం 70టిఎంసిలకు చేరుకోగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీటిని విడుదల చేయనున్నామని అన్నారు. విత్తనాలకు కొరత లేదని అన్నారు. పురుగు మందులు, ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా నియంత్రించాల్సిన బాధ్యత అధికారులపై వుందని అన్నారు. ప్రభుత్వం రూపొందించిన పొలంబడి కార్యక్రమాన్ని రైతులలోకి తీసుకువెళ్ళేందుకు వ్యవసాయ అధికారులు కృషి చేయాలని అనం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎమ్మెల్యే అనం వివేకానందరెడ్డి, నగర ఎమ్మెల్యే శ్రీధర కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.