రేషన్‌, సంక్షేమానికి వేర్వేరు గుర్తింపు కార్డులు!!

` తెలంగాణ సర్కారు సబ్‌ కమిటీ ఏర్పాటు
` త్వరలో కొత్త రేషన్‌ కార్డుల మంజూరికి కసరత్తు
` అర్హత గల ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చేలా నిర్ణయం
` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
` ప్రతి మూణ్నెళ్లకూ ప్రజావాణిపై ప్రణాళిక శాఖ సమీక్ష
హైదరాబాద్‌, ఆగస్ట్‌ 4 (జనంసాక్షి)
రేషన్‌ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలు పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. కొత్త రేషన్‌ కార్డులు, పెన్షన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో.. రేషన్‌ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. త్వరలోనే సమగ్రంగా చర్చించి కొత్త రేషన్‌ కార్డులు కూడా మంజూరు చేసేందుకు తగు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. కొత్త పెన్షన్లు సైతం అత్యంత త్వరలోనే అందించేందుకు తీవ్రంగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డితో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రజావాణి పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాలని ప్రజావాణి అధికారులు భావిస్తే వాటిని రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదించాలని తెలిపారు. ఇందులో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు, అవి పరిష్కరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, వివిధ ప్రభుత్వ శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం సందర్భంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్న తీరును అధికారులను విచారించారు. ఫిర్యాదు గారు తన సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఏ రకమైన వ్యవస్థ ప్రజావాణి లో ఉన్న అంశంపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఫిర్యాదు మొదట దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఎస్‌ఎంఎస్‌ పంపిస్తామని, సమస్య పరిష్కారం అయిన తర్వాత చివరగా మరొక ఎస్‌ఎంఎస్‌ మొబైల్‌ కు పంపిస్తామని ప్రజావాణి నోడల్‌ అధికారి దివ్య దేవరాజన్‌ సమావేశంలో వివరించారు. ఫిర్యాదు పరిష్కారం ఏ దశకు చేరిందనే అంశం తెలుసుకునే వ్యవస్థ ప్రస్తుతం లేదని ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
మహిళల కోసం ఆర్థిక సహకారం : భట్టి
మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తే ప్రయోజనం లేదు వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అందుకు అవసరమైతే ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. అన్ని ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ డెస్క్‌ లను బలోపేతం చేసేలా చర్యలు చేపడితే సీఎంఆర్‌ఎఫ్‌ కు సంబంధించి ఫిర్యాదులు తగ్గిపోతాయని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. జీరో విద్యుత్‌ బిల్లు దరఖాస్తులు తీసుకునే మండల స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. బీహార్‌ తో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పద్ధతులు ఆవ లంబిస్తున్నాయో అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు విజయవంతంగా పూర్తిచేసిన కొన్ని కేసుల గురించి సమావేశంలో నోడల్‌ అధికారి దివ్య దేవరాజన్‌ వివరించారు. తన వ్యవసాయ భూమిలో విద్యుత్‌ వైర్లు వేలాడుతున్న విషయాన్ని మహబూబ్నగర్‌ కు చెందిన రైతు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా స్థానిక విద్యుత్‌ అధికారులు రెండు రోజుల్లోనే పరిష్కరించడం.. ఆనందంగా స్పందిస్తూ అధికారులను అభినందిస్తూ ఆ రైతు అధికారులకు లేఖ రాసిన విషయాన్ని సమావేశంలో వివరించారు. ప్రజావాణి విభాగంలో పనిచేసేందుకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్‌ అధికారి దివ్య కోరగా డిప్యూటీ సీఎం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వచ్చే ఏడాది మార్చికల్లా..
యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి
సిబ్బంది క్వార్టర్స్‌ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవండి
దామరచర్ల నుండి పవర్‌ ప్లాంట్‌కు ఫోర్‌లైన్‌ బైపాస్‌ రోడ్డుపై వారంలో నివేదిక ఇవ్వండి : భట్టి
హైదరాబాద్‌ (జనంసాక్షి) : వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగాల్సిందేనని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. జెన్కో ఉన్నతాధికారులతో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి యూనిట్‌ అక్టోబర్‌ 30 కల్లా, రెండో యూనిట్‌ అక్టోబర్‌ 15 కల్లా, మూడో యూనిట్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి, నాలుగో యూనిట్‌ ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి, 5వ యూనిట్‌ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్లాంట్లో పనిచేసే కొద్దిమంది అధికారులు, సిబ్బంది జ్వరాలతో బాధపడుతున్నారు ఫలితంగా పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్టు సమావేశంలో జెన్కో అధికారులు వివరించారు. సిబ్బంది సంక్షేమమే ప్రధానం వెంటనే మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయండి, దోమల బారి నుంచి అధికారులు, సిబ్బందిని కాపాడేందుకు నిద్రించే క్యాంపుల్లో దోమతెరలు సరఫరా చేయండి, పని ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ఫాగింగ్‌ చేయండి అని ఆదేశించారు. అధికారులు, కార్మికుల భద్రతకు ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా వెనుకాడ వద్దని తెలిపారు. అధికారులు, కార్మికులు స్థానికంగా నివసించేందుకు వేను వెంటనే క్వార్టర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశించారు. స్థానికంగా నివసించేందుకు ఇబ్బందులు ఉన్నందున క్వార్టర్లు నిర్మించే వరకు మిర్యాలగూడ, దామరచర్ల నుంచి సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక బస్సులు అధికారులు సిబ్బందికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నుంచి బూడిద తరలింపునకు తాళ్ల వీరప్పగూడెం, దామరచర్లకు నాలుగు వరుసల బైపాస్‌ రోడ్డు నిర్మాణం ప్రగతిపై వారంలోగా తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆగస్టు మాసంలో తాను ప్లాంటును సందర్శించి, అధికారులు, సిబ్బందితో భేటీ అవుతానని తెలిపారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌, జన్కో డైరెక్టర్లు అజయ్‌, సచ్చిదానందం, వైటిపిఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సమ్మయ్య,ట్రాన్స్‌కో జేఎండి శ్రీనివాస్‌, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌, ఎస్పీడీసీఎల్‌ సిఎండి ముషారఫ్‌, ఎన్పీడీసీఎల్‌ సిఎండి వరుణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.