రైతులు అధైర్యపడొద్దు
– సర్కారు అండగా ఉంటుంది
– ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 6 లక్షల పరిహారం
– మంత్రి వర్గ నిర్ణయాలను వెల్లడించిన డెప్యూటీ సీఎం కడియం
హైదరాబాద్,సెప్టెంబర్19(జనంసాక్షి): రైతులు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని, రాష్ట్ర ప్రభుత్వం విూకు అండగా ఉందని భరోసా ఇచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం తర్వాత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరాలను వెల్లడించారు.ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచింది. ఇప్పటి వరకు లక్షా 50 వేలు మాత్రమే ఇస్తుండగా దాన్ని 6 లక్షల రూపాయలకు పెంచింది. ఐదు లక్షల రూపాయలు రైతు కుటుంబానికి, మిగతా లక్ష రూపాయలతో అప్పులకు వన్ టైం సెటిల్ మెంట్ కింద చెల్లిస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలుంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద సాయం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకరి చొప్పున వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 2,100 మంది అవసరం ఉండగా.. ప్రస్తుతం 1,100 మంది పనిచేస్తున్నారని, మరో వెయ్యి మందిని నియమించేందుకు పోస్టులు మంజూరు చేసినట్టు కడియం శ్రీహరి వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వ్యవసాయ అధికారి ఉండేలా చూడాలని చెప్పారు. మెదక్ జిల్లా ములుగులో ఫారెస్ట్ అకాడవిూ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. నాలుగు రిజర్వ్ పోలీస్ బెటాలియన్ల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ లలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటికోసం కొత్తగా 3,896 పోస్టులు మంజూరు చేసింది. పరిశ్రమల కోసం ప్రమోషన్, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు మూడు ట్రస్ట్ గ్రూపుల ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. చైనా, జపాన్, తైవాన్, హాంకాంగ్, కొరియాల కోసం ఒకటి, యుఎస్, కెనడా, యూరప్ దేశాల కోసం మరొకటి, గల్ఫ్ దేశాలు, ఇండియా కోసం మూడో గ్రూప్ పనిచేస్తుందని కడియం వివరించారు. రైతుల ఆత్మహత్యలపై మంత్రిమండలి విచారం వ్యక్తం చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, వర్షపాతం, పంటలపై జిల్లాల వారీగా వివరాలతో సీఎం కేసీఆర్ సవిూక్షించారని వెల్లడించారు. రబీకి అప్రోచ్ తయారు చేసుకోవాలని, నమోదైన వర్షపాతాన్ని బట్టి ఏ పంటలు వేసుకోవాలో వ్యవసాయ శాఖ గైడ్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకుందని కడియం శ్రీహరి గుర్తుచేశారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూశామని, కోతలు లేని కరెంట్ ఇస్తున్నామని, 2016 ఏప్రిల్ నుంచి పగటి పూట 9 గంటలు కరెంటు ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ. 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామన్నారు. ఇప్పటికే రూ. 8,500 కోట్లు రెండు విడతలుగా బ్యాంకులకు చెల్లించామని చెప్పారు. రైతుల ఆత్మస్థయిర్యాన్ని పెంచేవిధంగా రాతలు, కార్యాచరణ ఉండాలని ఈ సందర్భంగా విూడియా, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. రైతుల ఆత్మహత్యలపై గోరంతలు కొండంతలు చేసి వార్తలు రాయొద్దని, రాజకీయంగా వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్ ఈ నెల 30 వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు నమోదైన వర్షపాతం, పంటల విస్తీర్ణాన్ని బట్టి కరువుపై కేంద్రానికి నివేదిక ఇస్తామని కడియం తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలను బట్టి కరువు మండలాలను ప్రకటించాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు చెప్పారు. విూడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు.